Latest

మహిమ చెంబుల మాయాజాలం బట్టబయలు
AP: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో మహిమ గల రాగి చెంబుల పేరుతో అమాయకులను మోసం చేసి లక్షలు దోచుకునేందుకు కుట్ర పన్నిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక రసాయనాలు పూసిన రాగి చెంబుకు టార్చ్ వెలిగించగానే బల్బు ఫిలమెంట్ కాలిపోవడాన్ని "మహిమ"గా చూపించి, వాటికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించి భారీ మొత్తాలకు విక్రయించాలని యత్నించినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి 4 రాగి చెంబులు, 2 టార్చ్ లైట్లు, 8 మొబైల్ ఫోన్లు, బలెనో కారు, హోండా మాస్ట్రో స్కూటీ, నగదు స్వాధీనం చేసుకున్నారు.

సారీ..అంబులెన్స్‌లో డీజిల్ లేదు!
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పాతూరుగుంటకు చెందిన గర్భిణి లక్ష్మి అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రసవించింది. బిడ్డ ఆరోగ్యం కోసం చింతపల్లి హాస్పిటల్‌కి 45 కి.మీ బస్సులో..ఆపై 13 కి.మీలు జీపులో ప్రయాణించి హాస్పిటల్‌కి చేరుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వెళ్లేందుకు అంబులెన్స్‌ను కోరగా 'డీజిల్ లేదు' అని సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో భర్త భాస్కరరావు జోరువానలో బైక్‌పై 20 కి.మీ. మట్టి రోడ్డుపై ఆమెను తీసుకెళ్లాల్సి వచ్చింది.

తెలుగులో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ పుస్తకం
రాజకీయాలు, గూఢచర్యం, సెక్స్ వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతం తెలిసిందే. సముద్రం మధ్య అతడు సృష్టించిన దీవిలో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు జరిగాయని అనేక వార్తలు వచ్చాయి. ఈ అంశాలన్నీ వివరిస్తూ.. వ్యవస్థ వైఫల్యాలను ఎండగడుతూ రచయిత కృష్ణ కానూరి ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అనే పుస్తకం రాశారు. ప్రజాశక్తి బుక్‌హౌజ్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దీని ధర రూ.200/-.

హోం మంత్రి ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్
AP: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. హోం మంత్రి కార్యాలయ అధికారులు వెంటనే హెచ్చరికలు జారీ చేశారు. ఖాతా నుంచి అనధికారిక పోస్టులు వస్తున్నట్లు గుర్తించి, వాటిని అధికారిక ప్రకటనలుగా పరిగణించవద్దని తెలిపారు. సైబర్ దాడిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అకౌంట్ రికవరీ చేయడానికి, హ్యాకర్లను గుర్తించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

నేడు ప్రపంచ ఐవీఎఫ్(IVF) దినోత్సవం
ప్రతి సంవత్సరం జూలై 25న ప్రపంచ ఐవీఎఫ్ (In Vitro Fertilization) దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1978 జూలై 25న ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ శిశువు లూయిస్ బ్రౌన్ జన్మించిన సందర్భంగా ఈ రోజును ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవంగా గుర్తిస్తున్నారు. ఒక్కో సెంటర్కు ప్రతిరోజూ 50 నుండి 100 మందికి పైగా వస్తున్నారు. మనదేశంలో దాదాపు 2.8 కోట్ల మంది సంతానంలేక బాధపడుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల్లో అవగాహన పెంచడం, ఐవీఎఫ్ చికిత్స ప్రాధాన్యాన్ని చెప్పడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.

అత్యంత పౌష్టికాహారంగా కాక్రోచ్ మిల్క్
కాక్రోచ్(బొద్దింక) మిల్క్ భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత పౌష్టికాహారంగా మారే అవకాశముందని సైంటిస్టులు చెబుతున్నారు. 2016లో బెంగళూరులోని రీజనరేటివ్ మెడిసిన్ శాస్త్రవేత్తల రీసెర్చ్‌లో వీటిలో గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీలు ఉన్నట్లు గుర్తించారు. శరీర కణాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయని వెల్లడించారు. ఈ పాలు మనుషుల వినియోగానికి అందుబాటులో లేవు. అయితే భవిష్యత్తులో సూపర్ ఫుడ్‌గా ఉపయోగపడే అవకాశాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నారు.

దిల్లీలో రాత్రి 8 గంటలకే లిక్కర్ షాపులు బంద్!
దిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే లిక్కర్ షాపులను ఈ వారం అంతా రాత్రి 8 గంటలకే మూసివేయనున్నారు.

మందు తాగి పాఠశాలకొచ్చిన హెచ్‌ఎం
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పినపాడు గిరిజన సంక్షేమ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు హెచ్‌ఎం కె.వి.రమణ మందు తాగి వచ్చాడు. తల్లిదండ్రులు, గ్రామపెద్దలు ముందే ఆయన మత్తులో బెంచీపై పడిపోవడం చూసి తల్లిదండ్రులు మండిపడ్డారు. సీఆర్‌పీ రాము సమావేశాన్ని పూర్తి చేశారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన హెచ్‌ఎంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్
TG: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన 'కొమురవెల్లి పుణ్యక్షేత్రం' రైల్వేస్టేషన్ ఈనెల 26న ప్రారంభం కానుంది. దాదాపు రూ.6 కోట్లు ఖర్చు పెట్టి భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో సిద్ధం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర లీడర్లు వచ్చి సికింద్రాబాద్-సిద్దిపేట ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. భక్తులకు డైరెక్ట్‌గా ట్రైన్ జర్నీ సౌకర్యం దొరుకుతుంది.

రేపు ‘బాలా’ సాహిత్య సమావేశం
TG: తిరుపతికి చెందిన ప్రచురణ సంస్థ ‘బాలా బుక్స్’ ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సాహిత్య సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరం బషీర్‌బాఘ్ ప్రెస్‌క్లబ్‌లో జరగబోయే ఈ సమావేశంలో పాల్గొంటున్న రచయితలు, అనువాదకులు, ప్రచురణకర్తలు పాల్గొంటున్నారు. వివిధ సెషన్లలో వారంతా మాట్లాడతారు.

గూడ్స్ వాహనం బోల్తా.. చెల్లాచెదురైన సరుకు
TG: నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి పెయింట్ డబ్బాలు, లప్పం బ్యాగులతో విజయవాడ వైపు వెళ్తున్న మినీ గూడ్స్ వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనం బోల్తాపడి సరుకు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురైంది. కొంతసేపు హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలే కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే: రాహుల్ గాంధీ
నిరవధిక దీక్ష చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ జరిగిందని, వేలాది మంది విద్యార్థులు గాయపడ్డారని అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న మూడు డిమాండ్లు న్యాయమైనవేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని వారికి సూచించారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు.

జంతర్ మంతర్‌లో భోజనం పెడుతున్నాడని పోలీసుల దాడి: CJP
జంతర్ మంతర్‌లో నిరసనకారులకు భోజనం, నీళ్లు అందిస్తున్న మొహమ్మద్ జునైద్ ఇంటిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడి చేసి, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారని CJP ఆరోపించింది. నేరస్తులను వదిలేసి వాలంటీర్లను టార్గెట్ చేస్తున్నారని విమర్శించింది. ఈ ఘటనపై చట్టపరంగా పోరాడతామని, జునైద్‌కు పూర్తి అండగా ఉంటామని తెలిపింది. ఈ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.

కిడ్నీ పరీక్షలకు కొత్త డివైస్
TG: కిడ్నీ ఆరోగ్యాన్ని వెంటనే టెస్ట్ చెయ్యడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ రీసెర్చర్స్ పోర్టబుల్ డివైస్‌ను తయారు చేశారు. బ్లడ్ సీరం నమూనా ఆధారంగా యూరిక్ యాసిడ్, యూరియా, క్రియాటినిన్ స్థాయిలను ఇది నిమిషాల్లో గుర్తిస్తుంది. ఐఓటీ టెక్నాలజీ ద్వారా రిజల్ట్స్ నేరుగా ఫోన్ లేదా కంప్యూటర్‌కు పంపుతుంది. ఖరీదైన ల్యాబ్‌లు, ఎక్స్‌పర్ట్స్ అవసరం లేకుండానే ఈ డివైస్ పనిచేస్తుంది. మొదటి దశలోనే కిడ్నీ జబ్బులను గుర్తించడానికి, ఈ డివైస్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఆదివాసీ మహిళకు షాకింగ్ ట్విస్ట్
TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం జవహర్‌నగర్‌కు చెందిన హీరకుమ్ర లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు పథకం దరఖాస్తులో ఊహించని షాక్ ఎదురైంది. ఆన్‌లైన్ రికార్డుల్లో ఆమె పేరుపై ఇప్పటికే ఇల్లు మంజూరై, రూ.51,200 విడుదలైనట్లు నమోదైంది. అయితే వాస్తవానికి ఆమెకు ఎలాంటి ఇల్లు లేదు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసినా L3 జాబితాలో నిలిచిపోయింది. గతంలో హౌసింగ్ అధికారులు రేషన్‌కార్డ్ వివరాలను దుర్వినియోగం చేసి అక్రమంగా నిధులు మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకుని ఇల్లు ఇప్పించాలని ఆమె కోరింది.

CJPకి హీరోయిన్ జ్యోతిక సపోర్ట్
NEET-UG పేపర్ లీక్ వ్యవహారంపై జరుగుతున్న CJP ఉద్యమానికి హీరోయిన్ జ్యోతిక తన సపోర్ట్ తెలిపారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థుల పక్షాన నేను ఉన్నాను. బాధ్యత ఉండాలి.. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సోనమ్ వాంగ్చుక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్‌లను ప్రశంసిస్తూ "GenZ.. మీ గురించి గర్వంగా ఉంది. మీ పోరాటం ఎంతోమందికి ధైర్యం ఇచ్చింది" అని రాశారు.

తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, కడప జిల్లాల్లో, తెలంగాణలోని ఉత్తర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
స్కూల్లో గంజాయి కలకలం
AP: తిరుపతిలోని మంగళం క్వార్టర్స్ జిల్లా పరిషత్ పాఠశాల గోడ దూకి లోపలికెళ్లి కొందరు యువకులు మందు, గంజాయి తాగుతున్నారు. బడి ప్రాంగణాన్ని అడ్డాగా మార్చుకుని, ఇలాంటి పనులు చేస్తున్నందుకు స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ పనులకు పాల్పడుతున్న యువకులపై పోలీసులు, ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అగరబత్తి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
AP: కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్ దేవా అగరబత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లుకు కూడా వ్యాపించడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు. కళ్లముందే ఫ్యాక్టరీ అగ్నికి ఆహుతి కావడంతో యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు.
కేంద్ర మంత్రులు ఇన్‌స్టా రీల్స్ చేయాలా?: అభిజీత్ దీప్కే
ప్రధాని మంత్రులను ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ చేయాలని చెప్పడం ఏంటని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రధాని మోదీపై మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీపై చర్యలు తీసుకుంటామని కేబినెట్ భేటీని ఏర్పాటు చేసిన ప్రధాని విద్యార్థుల భవిష్యత్తు, సమస్యను పరిష్కరించడం వదిలేసి ఇవన్నీ చెప్పడం ఎందుకుని ప్రశ్నించారు. దేశానికి నిజంగా చదువుకున్నవాడే ప్రధానిగా ఉండాలని సెటైర్లు వేశారు.

కామన్వెల్త్ గేమ్స్ 2026..భారత్‌కు తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2026 గ్లాస్గోలో పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో భారత్‌కు చెందిన 'ఝాండు కుమార్' కాంస్య పతకం సాధించాడు. 190 కిలోల బరువు ఎత్తి ఆయన భారత్‌కు మొదటి పతకాన్ని అందించారు. అపారమైన పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనం, అన్ని సవాళ్లను అధిగమించి దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ తన x అకౌంట్‌లో ఆయనను అభినందించారు.