Latest

సాగుపై ఫోన్‌లో ఆరా తీసిన మంత్రి సీతక్క
TG: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ములుగు రైతులతో ఫోన్‌లో మాట్లాడి వర్షాభావ పరిస్థితులు, సాగు విధానాలపై ఆరా తీశారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ తెలంగాణ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, విత్తనాల విత్తకం, పంటల ఎంపికపై రైతులకు సూచనలు చేశారు. వర్షాభావం కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన “జలసిరి” కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

కోడింగ్‌తో కెరీర్‌ను నిర్మించుకోవాలి
TG: నేటి సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్‌కు భారీ డిమాండ్ ఉందని, విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ VC ఉమేష్ కుమార్ సూచించారు. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో నిర్వహించిన ‘కోడ్‌క్రాఫ్ట్ పైథాన్’ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కోడింగ్ ఆధారిత కోర్సులకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విశేషమైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కోడింగ్ నైపుణ్యాల ప్రాముఖ్యత, పైథాన్ ప్రోగ్రామింగ్ మెలుకువలపై అవగాహన కల్పించారు.

'ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కాదు.. మంత్రి రాజీనామా కావాలి'.. CJP ఫైర్!
NEET పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా Cockroach Janta Party వెనక్కి తగ్గలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పేపర్ లీక్ వివాదంలో రాజకీయ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది.
దేశంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించండి
నటి, నిర్మాత మంచు లక్ష్మి దేశంలో జరుగుతున్న సామాజిక, ప్రజా సమస్యలపై ప్రతి పౌరుడు బాధ్యతగా స్పందించాలని పిలుపునిచ్చారు. మనకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, అన్యాయాలపై ప్రతి ఒక్కరూ తమ స్వరం వినిపించాలని కోరారు. రాజ్యాంగ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఆమె సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. సమస్యలపై మాట్లాడటం, చర్చించడం, స్పందించడం కూడా బాధ్యతాయుతమైన పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు, రాబోయే తరాల సంక్షేమం కోసం ప్రజలంతా చొరవ చూపాలన్నారు.
బీజేపీ గూండాలను పంపిస్తోంది: అభిజిత్ దీప్కే
‘బయటి నుంచి జనాన్ని పంపి నిరసనను భంగపరుస్తున్నారు’ అని సీజేపీ నేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. దిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర నెల నుంచి కూర్చున్నా ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇప్పుడు మద్దతు పెరగడంతో బీజేపీ బయటి నుంచి గూండాలను పంపి ప్రజలను ఉసికొల్పుతోందని మీడియాతో చెప్పారు. పోలీసులు రాళ్ల ట్రక్కులు తీసుకొస్తున్నారని, బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసురుతున్నారని అన్నారు.

శాతవాహన యూనివర్సిటీలో TRSV నిరాహార దీక్ష
TG: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా TRSV నాయకులు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీతో దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేసి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.

రేపు ఇందిరా పార్క్ వేదికగా BRSV నిరసన.. కేటీఆర్ హాజరు
TG: దిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(BRSV) జులై 24 ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరసన చేపట్టనున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కేంద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విద్యార్థులు, యువత పాల్గొనాలని BRSV పిలుపునిచ్చింది.

ఆత్మహత్యకు ముందు షాకింగ్ సూసైడ్ నోట్
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పిట్ల వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందిన యువకుడు, ఆత్మహత్యకు ముందు SIR ఫాం మీద రాసిన సూసైడ్ నోట్‌లో తన చావుకు ప్రధాని మోడీ కారణమని పేర్కొన్నాడు. అలాగే తన కుటుంబసభ్యులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని, అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం నిర్వహించాలని కోరాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నీట్ వ్యవహారంలో కేంద్రం జవాబుదారీతనం వహించాలి: అన్నామలై
నీట్ ప్రవేశ పరీక్షకు ఇప్పటివరకు మద్దతుగా నిలిచిన కె.అన్నామలై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నీట్ వ్యవహారంపై జవాబుదారీతనం కోరారు. వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ రావడం సహజమేనని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

CJP నిరసనకు మద్దతుగా తమిళ సినీ డైరెక్టర్స్
CJP నిరసనకు తమిళ సినీ డైరెక్టర్స్ మద్దతు పలికారు. ‘No more NEET’ నినాదంతో చైన్నె నగరంలోని రాజరత్నం స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిరసన కార్యక్రమం జరుగనుంది. ఇందులో దర్శకులు వెట్రిమారన్, పా.రంజిత్, అమీర్ పాల్గొననున్నారు.

విద్యార్థులకు మద్దతుగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా?
ముంబైలోని దాదర్ ప్రాంతంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదేశంలో బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్ విద్యార్థుల హక్కుల కోసం మద్దతుగా నిలిచినందుకు ముంబై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తను కేవలం శాంతియుతంగా నిలబడి ఉన్నానని, ఎలాంటి నినాదాలు చేయలేదని ఆమె తెలిపారు. రోడ్డుపై నిలబడటమే నేరమా అని పోలీసులను ప్రశ్నించారు. మూడు గంటల కస్టడీ తర్వాత ఆమెను వర్లీ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, ప్రకాష్ రాజ్ విద్యార్థులకు, ఆయేషాకు మద్దతు తెలిపారు.

కలెక్టర్ వినూత్న తనిఖీలతో స్కూల్స్‌లో మార్పు
కేరళంలోని అల్లపుజ జిల్లా కలెక్టర్ ఎస్.సుహాన్ వినూత్న కార్యక్రమంతో ప్రశంసలు అందుకుంటున్నారు. 2012 IAS బ్యాచ్‌కు చెందిన ఆయన, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు తరచూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. నీరుకున్నమ్‌లోని శ్రీదేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో పిల్లల మధ్య కూర్చుని భోజనం చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వయనాడ్‌లో కలెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా గిరిజన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల సంఖ్య పెంచారు. కలెక్టర్ తనిఖీలతో స్కూల్స్ అన్నీ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏ స్కూల్‌కు వచ్చి భోజనం చేస్తారోననే భయం పట్టుకుంది.

30 ఏళ్లుగా కనిపించని కొడుకు..ఎలా దొరికాడంటే!
AP: పదో తరగతిలో ఫెయిల్ అయ్యాననే భయంతో 1996లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రాముడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ముంబై, పూణె, బెంగళూరు నగరాల్లో ఉంటూ అక్కడే కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఇటీవల SIR అప్లికేషన్ నింపే సమయంలో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో సొంత ఊరు గుర్తుకొచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఎమ్మిగనూరుకు వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
TG: ఉదయం లక్డీ-కా-పుల్‌లోని డీజీపీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో స్వామి అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని దగ్గర లభించిన లేఖలో 'తన భార్యాపిల్లల గురించి ఎవరూ ఏమీ అనకూడదని, తాను చనిపోయి దెయ్యంగా మారినా వారిని చూసుకుంటూనే ఉంటానని, వారు మంచివారని' రాశాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

పేపర్ లీక్‌లపై మోదీ ఫస్ట్ రియాక్షన్
నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడేవారికి వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. యువత భవిష్యత్తు, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి, త్వరగా శిక్షలు పడేలా ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని, ఈ ప్రక్రియను వెంటనే అమలు చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని మోదీ స్పష్టం చేశారు.

యువకుడి కంటిపై పెల్లెట్ ప్రభావం
ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన ఆందోళనలో ఒక నిరసనకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆందోళన సమయంలో పెల్లెట్లు కంటిలోకి దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆయన్ని మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కన్నును కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP పిలుపునిచ్చిన ఆందోళన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారు.

మైనింగ్ అధికారుల పేరుతో దందా
TG: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట టిప్పర్ యజమానులు, డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. మైనింగ్ శాఖ అధికారుల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు రోడ్లపై టిప్పర్లను అడ్డగించి వేధింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని, భారీ పెనాల్టీలు విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ రంగంపై దాదాపు 200 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అధికారుల వేధింపులతో తమ ఉపాధి సంక్షోభంలో పడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ వసూళ్లపై విచారణ జరిపి, తమను కాపాడాలని వారు కోరారు.

విద్యాసంస్థల బంద్ పిలుపు
నీట్, ప్రశ్నాపత్రాల లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ, రేపు (ఈ నెల 24న) AP, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బంద్‌లో పాల్గొనాలని కోరాయి. SFI, PDSU, AISF, NSUI తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలపై విచారణ వంటి డిమాండ్లతో బంద్ నిర్వహించనున్నారు.

ఆటో కోసం వేచి ఉన్న బీటెక్ విద్యార్థిపై దాడి
AP: తిరుపతి జిల్లా రేణిగుంటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో బీటెక్ విద్యార్థి రాకేశ్‌పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయ్, సుజన్, శ్రీను అనే ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల ముగిసిన తర్వాత జిరాక్స్ షాప్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో గొడవ జరిగిందని, విజయ్ కూల్‌డ్రింక్ బాటిల్‌తో తలపై కొట్టడంతో గాయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురూ కలిసి చేతులతో, కాళ్లతో దాడి చేయడంతో రాకేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

‘పెద్ది’ పోస్టర్‌తో అలిపిరిలో హల్‌చల్
AP: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ మహిళ ‘పెద్ది’ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. శ్రీవారి క్షేత్రంలో సినిమా, రాజకీయ ప్రచారాలకు TTD కఠిన నిషేధం ఉన్నప్పటికీ పోస్టర్‌తో తిరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు నిబంధనలు అమల్లో ఉన్నా, భద్రతా సిబ్బంది ఈ ఘటనను అడ్డుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. TTD చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ ఘటనపై HYDలో సంఘీభావ కార్యక్రమం
TG: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా ప్రతిఒక్కరూ దేశవ్యాప్తంగా సంఘీభావం ప్రకటించాలని ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ JAC పిలుపునిచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగే ఈ సంఘీభావ నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీయువకులు పాల్గొనాలన్నారు. నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు చేసిన లాఠీచార్జీని, నిర్బంధాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది.