Latest

కరోనా కలకలం.. ఆరోగ్యశాఖ హైఅలర్ట్
APలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకే రోజు గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒకటి చొప్పున మొత్తం 7 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 9 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు నలుగురు మరణించారు. కేసుల పెరుగుదలతో ఆరోగ్యశాఖ అప్రమత్తమై, 17 బోధనాస్పత్రుల్లో 255 ప్రత్యేక కొవిడ్ పడకలు సిద్ధం చేసింది. మాస్కులు, PPE కిట్లు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచింది.

ఫోర్జరీ ఆరోపణలపై తమ్మినేనికి చుక్కెదురు
AP: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే కేసులో అరెస్టు నుంచి రక్షణ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని పేర్కొంటూ, అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

వరి, చెరకు సాగుపై అలర్ట్
TG: ఎల్‌నినో ప్రభావం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జూన్‌లో ప్రారంభమైన ఈ ప్రభావం డిసెంబరు వరకు తీవ్రంగా ఉండి, వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖరీఫ్ తర్వాత యాసంగి సాగు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. ఆగస్టులో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా, సెప్టెంబరులో ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

APలో UAE ఫుడ్ క్లస్టర్‌కు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్‌లో UAE ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు యూఏఈ ప్రభుత్వం APలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబు, UAE మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో APEDB అవగాహన ఒప్పందం కుదిరింది. మామిడి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు వ్యాల్యూ యాడెడ్ చైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో రూ.100 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.

భూసేకరణలో స్పీడ్ పెంచాలి.. లేదంటే చర్యలు తప్పవు
TG: పారిశ్రామిక పార్కులు, ఎడ్యుకేషనల్ హబ్‌ల కోసం భూసేకరణపై జిల్లా కలెక్టర్లకు CM రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 30లోగా 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూమి సేకరణ పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్ హబ్, ఇండస్ట్రియల్ పార్కులు, రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2028 జూన్ 2 నాటికి కొడంగల్‌లోని అన్ని రోడ్లు పూర్తి కావాలని, ప్రతి తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను CM ఆదేశించారు.

తెలంగాణలో సైలెంట్‌గా కరోనా వ్యాప్తి
TG: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. APలో ఇప్పటికే కొవిడ్ కారణంగా నలుగురు మృతి చెందగా, హైదరాబాద్‌లో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్స్ తెలిపారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు జరగకపోవడంతో కేసులు నిర్ధారణ కావడం లేదని సమాచారం. తార్నాకకు చెందిన ఓ మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిని మృతి చెందిన ఘటనలో కూడా కొవిడ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెస్టు కిట్ల కొరత, ముందస్తు జాగ్రత్తల లోపంపై ప్రజారోగ్య విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్త తరహా నేరాలకు చెక్
AP: రాష్ట్రంలో కొత్త తరహా నేరాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. మారిపోతున్న నేరాల స్వభావం, ఎదుర్కోవడంలో తలెత్తుతున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో 3 రోజులపాటు జరిగే ఈ సదస్సును ఆమె ప్రారంభించారు. సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసింగ్‌ను సాంకేతికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణలో 3P విధానం ప్రెడిక్షన్, ప్రికాషన్, ప్రివెన్షన్ అమలు చేయాలని సూచించారు.

హై వే విస్తరణ పేరుతో చెట్లు నరకొద్దని స్థానికుల నిరసనలు !
డెహ్రాడూన్-రిషికేశ్ హైవే విస్తరణకు దాదాపు మూడు వేల సాల్ చెట్లను నరకాలనే ప్రతిపాదన అక్కడి లోకల్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ చెట్లు శివాలిక్ అడవుల్లో ఏనుగుల కారిడార్‌కు రక్షణగా ఉండటమే కాకుండా, పశువులకు మేతనిస్తాయి. చెట్లు పోతే మేత కొరతతో అప్పుల పాలవుతామని గ్రామస్థులు వాపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి, నీటి వనరులు ఎండిపోతాయన్నది నిపుణుల హెచ్చరిక. తీవ్ర నిరసనల మధ్య ప్రభుత్వం చెట్ల నరికివేతను తాత్కాలికంగా నిలిపివేసింది. రోడ్డు అవసరమా అనే ప్రశ్నలు, పర్యావరణ అంచనా లేకుండా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాహుల్ ముక్కునుంచి బ్లడ్ ! పెనుగులాటలో మెడ, చేతులకు గాయాలు
సీజెపి నిరసనలకు మద్దతుగా ప్రధాని ఇంటి ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పోలీసులు బల ప్రయోగం చేశారు. నిరసనగా రోడ్డుపై పడుకున్న రాహుల్ ను బలవంతంగా తరలించడంలో పెనుగులాట జరిగింది. ఈ ఘర్షణ వల్ల రాహుల్ ముక్కు చిట్లి రక్తం కారింది. ఆయన టీ షర్టు పై కూడా బ్లడ్ మరకలు పడ్డాయి. మెడ, చేతులకు చిన్న పాటి గాయాలయ్యాయి. అయినా పోలీసులు ఆయనకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా వ్యాన్ లో కుక్కేశారు. కాంగ్రెస్ పార్టీ ఈవిషయాన్ని తమ ఎక్స్ ఎక్కౌంట్ లో పోస్ట్ చేసింది. ఎట్టకేలకు మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి రాహుల్ రిలీజ్ అయి ఇంటికి బయల్దేరారు.

చెన్నై బయో-సిఎన్‌జి ప్లాంట్‌లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని చేట్‌పెట్ బయో-సిఎన్‌జి ప్లాంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తడి చెత్తను బయో-సిఎన్‌జి, సేంద్రీయ ఎరువుగా మార్చే విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో రోజూ వచ్చే 6,150 టన్నుల చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణం, సిమెంట్ పరిశ్రమల్లో ఇంధనంగా వాడాలని ఆదేశించారు. ఇదే తరహా బయో-సిఎన్‌జి ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో నిర్ణీత గడువులోగా ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంపై హేయమైన దాడి - ప్రియాంక !
పార్లమెంట్ సమీపంలో క్రాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌ను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యలను ప్రజాస్వామ్యంపై జరిగిన అసహ్యకరమైన దాడి అని ఆమె అభివర్ణించారు. ప్రధాని ఇంటి సమీపంలో 'ఇండియా' కూటమి నేతలతో కలసి చేపట్టిన నిరసన సందర్భంగా మాట్లాడిన ఆమె, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిపై విరుచుకుపడ్డారు. పోలీసులు ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

కొత్త ప్రొడక్ట్స్,యాప్స్, స్టార్టప్స్ కి గైడెన్స్ The mirror trap
ప్రసిద్ధ ప్రోడక్ట్స్ ను' మిర్రరింగ్' (అనుకరించడం) చేయడం ద్వారా కొత్త ప్రాడక్ట్స్ వినియోగదారులను ఎలా ఆకట్టుకోవచ్చో "The Mirror Trap: How Copying Winners Can Lose You the Game" అనే పుస్తకం నిజ జీవిత ఉదాహరణలతో వివరిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే సక్సెస్ అయిన డిజైన్లు, ఫీచర్లు, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను స్టడీ చేసి, వాటికి అనుగుణంగా కొత్త ప్రోడక్ట్స్ తయారీ వల్ల వినియోగదారుల్లో నమ్మకం, అలవాటు వేగంగా పెరుగుతాయని ఈ పుస్తకం స్పష్టం చేస్తోంది. డిజిటల్ ఉత్పత్తులు, యాప్‌లు, స్టార్టప్‌లు యూజర్ల ఆదరణ పొందేందుకు ఈ వ్యూహం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ధర్మేంద్ర ప్రధాన్ ను కడిగి పారేసిన రేణుక !
నీట్ పేపర్ లీక్ విషయంలో అక్రమార్కుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ ఆవరణలో ఉండగా.. అక్కడికి రేణుకా చౌదరి వచ్చారు... పక్కనే నిలబడి మోదీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు..! నిన్నటి కాక్రోచ్ ఆందోళన.. నేటి రైతుల ఆందోళనను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకు పడ్డారు... యూజ్ లెస్ ఫెలోస్ అంటూ విమర్శలు చేశారు... రేణుక అలా గట్టిగా వాయిస్ పెంచి ఎటాక్ చేస్తుండడంతో బిత్తరపోయిన ప్రధాన్ అటూ ఇటూ చూస్తూ మెల్లిగా అక్కడినుండి జారుకునే ప్రయత్నం చేశారు.. అయినప్పటికీ ఆమె వదలకుండా అతనితో పాటు మెట్లు దిగుతూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

రాజస్థాన్ లో దళిత పూజారిపై పదే పదే దాడులు !
రాజస్థాన్‌లో ఒక దళిత పూజారిపై ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. తమను హిందువులుగా గుర్తించడం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ వేధింపులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌ను సైతం ఆశ్రయించినా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన ఈ ఘటన సమాజంలో కుల వివక్ష, దళితులపై జరుగుతున్న వరుస దాడులు , శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

గ్లోబల్ మీడియా దృష్టికి CJP నిరసనలు- మోడీ సర్కార్ కి సవాల్ !
ఢిల్లీలో విద్యార్థులు, యూత్ చేపట్టిన క్రాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు మోదీ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా పెద్ద సవాల్‌గా మారాయి. NEET పేపర్ లీకేజీలు, అవినీతి, నిరుద్యోగంపై జూలై 2026లో మొదలైన ఈ ఉద్యమం జంతర్ మంతర్ నిరాహార దీక్షతో పీక్ స్టేజికి చేరింది.. ఇటీవల జరిగిన 'ఛలో సంసద్' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. సోషల్ మీడియా మీమ్స్‌తో మొదలై వేలాది మందిని రోడ్లపైకి తెచ్చిన ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని, ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న తీరును, గ్లోబల్ మీడియా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. ఈ వార్తని హైలైట్ చేస్తోంది.
ప్రధాని ఇంటి ముట్టడి- రాహుల్, ప్రియాంక అరెస్ట్ !
ప్రధాని మోదీ ఇంటి దగ్గర ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ , అక్రమాల వ్యవహారంపై పార్లమెంట్ లోపల, బయట ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకొబోతే రాహుల్ రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. రాహుల్ హై ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉన్నా పోలీసులు బలప్రయోగం చేసి బలవంతంగా వ్యాన్లలో తరలించారు. ఈ అరెస్టులతో రాజధాని పరిసరాల్లో తీవ్ర టెన్షన్ ఏర్పడింది. ప్రతిపక్షాల ఆందోళనలు మరింత ముదిరాయి.

విద్యార్థి ఉద్యమాలతో దేశ రాజకీయాల్లో హీట్! 1974 వైబ్స్ మళ్లీనా?
దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, నిరసనలు ఊపందుకోవడంతో 1974లో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) నేతృత్వంలోని ఉద్యమం( సంపూర్ణ క్రాంతి ఉద్యమం) గుర్తుకొస్తోందన్న చర్చ పెరుగుతోంది. అప్పట్లో విద్యార్థుల పోరాటానికి జేపీ మద్దతు ఇవ్వగా, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత ఇందిరా గాంధీ ప్రభుత్వం 1977 ఎన్నికల్లో ఓడింది. ఇప్పటి ఉద్యమాలు కూడా అలాంటి రాజకీయ మలుపు తిప్పుతాయా? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లల జననం
ఆస్ట్రేలియాకు చెందిన నామోనా అనే 34 ఏళ్ల మహిళ ఇటీవల నలుగురు ఆడపిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే సాధ్యమయ్యే అరుదైన ఈ ప్రసవంలో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే ముగ్గురు పిల్లలున్న ఆ జంటకు ఇప్పుడు నలుగురు బేబీస్ తోడవ్వడంతో వాళ్ళ కుటుంబసభ్యుల సంఖ్య 9కి పెరిగింది. అయితే పిల్లల సంరక్షణకు అయ్యే ఖర్చులు తలుచుకుంటూ తల్లి ఆందోళన పడుతోంది.

కొలకత్తా ఎయిర్‌పోర్ట్ మసీదులో నమాజ్ బ్యాన్
కొలకత్తా ఎయిర్‌పోర్ట్‌లోని 136 సంవత్సరాల పురాతన మసీదులో ప్రవేశాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. సెక్యూరిటీ రీసన్స్, రన్‌వే విస్తరణ అవసరాలను కారణాలుగా చెప్పి ఈ నిర్ణయం తీసుకుంది. మసీదు రన్‌వేకు 165 మీటర్ల దూరంలో ఉండటం విమానాల రక్షణ సమస్యగా మారిందని తెలిపింది. మసీదును ఎయిర్‌పోర్ట్ బయటకు మార్చాలని, అక్కడ కొత్త మసీదు నిర్మించాలని చెప్పింది.
తెలంగాణ లోక్ భవన్ దగ్గర స్టూడెంట్స్ నిరసనలు
TG: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్‌భవన్ దగ్గర నిరసనలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబివ్వాలని ఆగ్రహించారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

విజేత దహియాను పార్టీ నుంచి తీసేసిన CJP!
కాక్రోచ్ జనతా పార్టీ తమ Spokesperson విజేత దహియాను పదవి నుంచి తొలగించింది. శాంతియుత నిరసనకారులపై, తమ టీమ్‌పై తీవ్రమైన పోలీస్ దాడి జరుగుతున్న సమయంలో ఆయన ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన పార్టీ.. ఆయన ప్రవర్తన తమ మూవ్‌మెంట్ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకే విజేత దహియాను స్పోక్స్ పర్సన్ పదవితో పాటు అన్ని అధికారిక బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నట్లు ఎక్స్ (X) ద్వారా ప్రకటన విడుదల చేసింది.