Latest

నైతిక బాధ్యతతో పవన్ తప్పుకోవాలి
AP: కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారంలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పరామర్శించారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల అదృశ్య ఘటనలపై గట్టిగా మాట్లాడిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ విషయంలో మాత్రం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ పవన్ కళ్యాణ్ వెంటనే తన డిప్యూటీ CM పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తమ కుమార్తెది ఆత్మహత్య కాదు, హత్య చేశారు
TG: హైదరాబాద్ లంగర్‌హౌస్ PS పరిధిలోని ఓ హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు క్లబ్ డ్యాన్సర్ రేణుక(26)గా గుర్తించారు. ఫారూఖ్ అనే వ్యక్తితో కలిసి రేణుక హోటల్‌లో గది బుక్ చేసుకుంది. ఫారూఖ్ బయటకు వెళ్లి వచ్చేసరికి రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. రేణుకది ఆత్మహత్య కాదని, హత్య చేశారని యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ గోడలు దూకి రావణ్‌పై అటాక్ ప్లాన్!
మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్ లోపల ఉన్న 'ప్రశ్న రావణ్' పై అటాక్ చేయడానికి జనసేన లీడర్స్ ఏకంగా పోలీస్ కాంపౌండ్ గోడలు ఎక్కడానికి ట్రై చేశారు. రావణ్‌ను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ జనసేన కార్యకర్తలు భారీగా నినాదాలు చేస్తూ, అక్కడ గట్టిగా వార్నింగ్స్ ఇచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ ఏరియాలో పెద్ద గొడవ జరిగే పరిస్థితి కనిపించింది.
విజయ్, త్రిషపై కామెంట్స్.. DMK MLA అరెస్ట్!
CM విజయ్, హీరోయిన్ త్రిషపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన DMK MLA అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రీసెంట్‌గా ఒక మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ. తాను పాలిటిక్స్‌లోకి వచ్చి ఇలా ఇరుక్కుపోయానని విజయ్ ఫీల్ అవుతున్నారు. ఇంట్లో త్రిషతో ఎంతో హ్యాపీగా ఉండేవాడినని ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో? అంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఆయనపై కేసులు పెట్టారు. దీనితో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు రిజెక్ట్ చేయడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రశ్న రావణ్ కోసం పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకున్న జనసైనికులు!
మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ దగ్గర జనసైనికులు భారీగా గ్యాదర్ అయ్యారు. తమ లీడర్ పవన్ కళ్యాణ్‌పై 'ప్రశ్న రావణ్' తప్పుగా ఎందుకు మాట్లాడారో అడిగి తెలుసుకోవడానికే తాము ఇక్కడికి వచ్చామని, కానీ పోలీసులు అతనికి భారీ సెక్యూరిటీ ఇచ్చి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేస్తూ తమని మాత్రం వెనక్కి పంపించేస్తున్నారంటూ జనసైనికులు తీవ్రంగా ఫైర్ అయ్యారు.
BRS లీడర్స్‌కు జూపల్లి మరోసారి ఓపెన్ ఛాలెంజ్!
మంత్రి జూపల్లి కృష్ణారావు BRSకు మరోసారి సవాల్ విసిరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ అప్పులపై ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. BRS తీరు 'ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ డెడ్' లా ఉందని విమర్శించారు. తన లెక్కలు తప్పని నిరూపిస్తే తాను మినిస్టర్ పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ BRS తప్పు తేలితే KTR, హరీష్‌రావు రిజైన్ చేసి పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.

తెలంగాణలో బిగ్‌బాస్ షో నడుస్తోంది
TG: రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీల మధ్య బిగ్‌బాస్ షో నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, BRS పార్టీలు రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు. తాము డిస్ట్రబ్ చేయకుండా పార్టీ పరంగా అధికారంలోకి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టామని అన్నారు. CM రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో అర్థమైందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా అవినీతి పాల్పడిన కల్వకుంట్ల కుంటుంబంలో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

కూతురు కోసం తండ్రి కన్నీటి పోరాటం
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సై 27 రోజులైనా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏజెన్సీ ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. CCTV ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, స్థానికులను విచారిస్తూ పాప ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ బిడ్డ కోసం తండ్రి గణేష్ పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. గణేష్ స్వయంగా లంబసింగి, చింతపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో జ్ఞానేశ్వర్ ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను అతికించారు. పాప కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అప్పులు తీర్చలేక దంపతుల ఆత్మహత్య
TG: తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్(32), శిరీష(28) దంపతులు. వీరు గత కొంతకాలంగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలసవచ్చి, హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు కిందపడి దంపతులు మృతి చెందారు.
3వ పెళ్లికి రెడీ అయిన అమీర్ ఖాన్
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తన 3వ పెళ్లిపై అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు. జూలై 5న తాను మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ముంబైలో ప్రెస్ ముందు అనౌన్స్ చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా, కేవలం క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఈ వెడ్డింగ్ జరగబోతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

సిట్‌పై CI నాగరాజు షాకింగ్ ఆరోపణలు
AP: విజయవాడ సాయికృష్ణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక CI నాగరాజు విజయవాడ కోర్టుకు సంచలన లేఖ రాశారు. సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజంలేదని లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారని సీఐ ఆరోపించారు. కస్టడీ విచారణ సమయంలో అధికారులు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును వేడుకున్నారు. విచారణ ప్రక్రియ అంతా న్యాయవాదుల సమక్షంలోనే జరిగేలా చూడాలని ఆయన లేఖలో కోరారు.

పెళ్లి అయిన నెలకే విషాదం
TG: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలానికి చెందిన దినేష్(26) గురువారం స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపల వేటకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం దినేష్ డెడ్‌బాడీ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దినేష్‌కు ఈ ఏడాది మే 26న లింగిగూడ గ్రామ ఉపసర్పంచ్ కవితతో మ్యారేజ్ అయింది. పెళ్లయి నెల రోజులకే ఈ విషాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

డిప్యూటీ CM కాన్వాయ్ దారి మళ్లింపు... SIపై వేటు
TG: సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ SI గోపాల్‌పై వేటు పడింది. డిప్యూటీ CM భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను SI మార్గం మళ్లించడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఘటనపై డిప్యూటీ CM స్వయంగా DGPకి ఫిర్యాదు చేశారు. SI గోపాల్ వ్యవహారంపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SP వెంటనే SI గోపాల్‌రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.

దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు
AP: అనంతపురం నగరంలోని వన్‌టౌన్ PS పరిధిలోని శారదనగర్‌లో ఓ ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులు రాత్రి 10గంటల సమయంలో దొంగనోట్లను ముద్రిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి దొంగ నోట్ల ప్రింటింగ్ మెషన్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే?
ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. ఈ రోజు ఆయన హెల్త్ అప్‌డేట్‌ను డాక్టర్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం వాంగ్‌చుక్ బ్లడ్ ప్రెజర్ (BP) 110/75 mmHg, పల్స్ రేట్ 72 bpm గా నార్మల్‌గానే ఉన్నప్పటికీ. బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రం 61 mg/dL కి పడిపోయాయి. ఆహారం తీసుకోకపోవడం వల్లే షుగర్ లెవెల్స్ ఇలా తగ్గాయని, ఆయన కండిషన్‌ను కంటిన్యూగా మానిటర్ చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
AP గవర్నమెంట్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్!
యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో సీరియస్ అయ్యారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇవ్వగానే, పోలీసులు వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కక్షసాధింపు చర్యల కోసం దాదాపు 30 కేసులు రెడీగా పెట్టుకోవడం ఏంటి అని విమర్శించారు. ప్రభుత్వం తన పవర్‌ను మిస్‌యూజ్ చేస్తోందని, ప్రజలంతా ఇదంతా గమనిస్తున్నారని ప్రకాష్ రాజ్ ట్విట్టర్‌లో ఒక వీడియో ద్వారా AP గవర్నమెంట్‌ను ప్రశ్నించారు.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.2,450 పెరిగి ప్రస్తుతం రూ.1,44,700 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,250 పెరిగి రూ.1,34,750 గా ఉంది. కేవలం గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ రేట్ కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 పెరగడంతో ఇప్పుడు మార్కెట్లో సిల్వర్ రేట్ రూ.2,60,000 కి చేరుకుంది.

నకిలీ ఆర్మీ ఆఫీసర్ డ్రామా.. యువకుడు అరెస్ట్
TG: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు నాగోల్ CI మక్బూల్ జాని తెలిపారు. శామీర్‌పేట్‌కు చెందిన ముకేరా గోవర్ధన్(29) ఆర్మీ ఆఫీసర్ నంటూ నకిలీ AI ఫొటోలతో సోషల్ మీడియా ద్వారా నాగోల్ పరిధిలోని ఆనంద్‌నగర్‌కు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆమె నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ముఖం చాటేసి బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడికి ఇప్పటికే పెళ్లైనట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆటోను ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన బస్సు
AP: నెల్లూరు జిల్లా కోట మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ముందు వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కనున్న దుకాణాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కేశవరం గ్రామానికి చెందిన శివ (22), వంజివాక గ్రామానికి చెందిన వినోద్ (21)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అర్ధరాత్రి మిల్లులో మంటలు.. స్థానికుల్లో టెన్షన్
TG: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో పత్తిగింజల బస్తాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లులో నిల్వ చేసిన పత్తిగింజల బస్తాలకు ఇరువైపులా వడ్ల బస్తాలు ఉన్నప్పటికీ వాటికి పెద్దగా నష్టం జరగకపోవడం, మధ్యలోని పత్తిగింజల బస్తాలకే మంటలు వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొంత ఆలస్యమై ఉంటే మంటలు పక్కనే ఉన్న వడ్ల బస్తాలకు వ్యాపించి భారీ ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

భర్త చెవిలో విషం పోసిన భార్య
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా పుళుదికుడి గ్రామానికి చెందిన రవిచంద్రన్, ఉమారాణి దంపతులు. కొత్త ఇల్లు నిర్మించేందుకు రవిచంద్రన్ వివిధ వ్యక్తులు, సంఘాల నుంచి రూ.10లక్షల లోన్ తీసుకున్నాడు. లోన్ చెల్లించలేకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త చనిపోతే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ఉమారాణి, రవిచంద్రన్ గాఢనిద్రలో ఉండగా అతని చెవిలో విషపదార్థం పోసింది. అస్వస్థతకు గురైన రవిచంద్రన్ అప్రమత్తమై తప్పించుకుని స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.