TG

పేదల బియ్యం కాజేసి.. బ్లాక్ మార్కెట్‌లో అమ్మేశాడు
TG· 9 Jul 2026

పేదల బియ్యం కాజేసి.. బ్లాక్ మార్కెట్‌లో అమ్మేశాడు

TG: పెద్దపల్లి జిల్లాలోని కట్నేపల్లిలో సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్‌, సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్‌ పేర్ల మీద రైస్ మిల్లర్ మారుతి ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్నాడు. 7,625 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు. అలాగే పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే PDS బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.132 కోట్ల విలువైన బియ్యం కాజేసినట్లు లెక్క తేలింది. అతడిపై PD యాక్ట్‌ నమోదు చేశారు. పోలీసులు మారుతిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

అధికారుల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నం
TG· 8 Jul 2026

అధికారుల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నం

TG: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం శాసనూలు గ్రామంలో అంగన్వాడీ టీచర్ షాహిదాబేగం BLOగా విధులు నిర్వహిస్తున్నారు. 'SIR', ఆన్‌లైన్ అప్డెట్స్, ఫారాల పరిశీలన, ఇంటింటి సర్వేలు, డేటా నమోదు వంటి పనులు వెంటనే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి పెట్టారు. దీంతో పెబ్బేరులోని ఆమె ఇంట్లో పురుగులమందు తాగింది. కుటుంబసభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తు, గుడ్లు, తదితర వాటి వివరాలు యాప్‌లో సమాచారం నమోదు చేయడంతోపాటు ఎన్నికల విధులు నిర్వహించడం కష్టంగా మారిందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియురాలి పెళ్లి.. పోస్టర్లతో షాక్ ఇచ్చిన ప్రేమికుడు
TG· 8 Jul 2026

ప్రియురాలి పెళ్లి.. పోస్టర్లతో షాక్ ఇచ్చిన ప్రేమికుడు

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు, ఓ యువతి గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబసభ్యులు ఆమెకు తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చయించారని, తమ ప్రేమను అంగీకరించకుండా బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారని ప్రియుడు ఆరోపించాడు. అర్ధరాత్రి కారులో తంగళ్లపల్లికి చేరుకున్న యువకుడు, తాను యువతితో దిగిన ఫొటోతో పాటు పెళ్లి చేసుకోబోతున్న వరుడి ఫొటోను కలిపి ముద్రించిన వాల్ పోస్టర్లను గ్రామంలోని ప్రధాన కూడళ్లు, గోడలపై అతికించాడు.

AI అంటే సర్వర్లు మాత్రమే కాదు
TG· 8 Jul 2026

AI అంటే సర్వర్లు మాత్రమే కాదు

TG: క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే AI కాదు. దీని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని, దీనిని ప్రభుత్వం గుర్తించిందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి తెలంగాణ AI ప్రమాణాలకు దిక్సూచిగా నిలుస్తోందన్నారు. నీరు, విద్యుత్తును హరిస్తూ AIని నిర్మించడం కాకుండా, పునరుత్పాదక ఇంధనం, వనరులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి
TG· 8 Jul 2026

పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి

TG: హన్మకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్(17) మృతి చెందాడు. ఇటీవల అతడి ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ మృతి చెందాడు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమైన నిరంజన్‌ను గతనెలలో పవన్ పరామర్శించారు. నిరంజన్‌ను కలిసినప్పుడు పవన్ కల్యాణ్ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. ‘OG 2' మూవీ తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్' అని, ఇద్దరం కలిసి సినిమా చూద్దామని పవన్ చెప్పారు.

భూపరీక్షలు చేయకుండానే బ్యారేజ్‌లు నిర్మించారు
TG· 8 Jul 2026

భూపరీక్షలు చేయకుండానే బ్యారేజ్‌లు నిర్మించారు

TG: KCR అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, మీరు చేసిన నేరం ఘోరం మీకు తెలుసు. అందుకే ముఖం చాటేస్తున్నారని CM రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రజాభవన్‌లో మంత్రులు, MLAలు, MLCలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును KCR 2019 జూన్ 21న ప్రారంభించారు. ఏడాది తిరిగే లోపే మేడిగడ్డలో లోపాలన్నీ బయటపడ్డాయి. రోజురోజుకి సమస్య పెద్దదై కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నారు. భూపరీక్షలు చేయకుండానే ఇసుకలో బ్యారేజ్‌లు కట్టారు. కట్టిన వెంటనే 100శాతం సామర్థ్యంతో నీళ్లను నిల్వ చేయడంతో బరువు తట్టుకోలేక మేడిగడ్డ కుంగిపోయిందని CM ఫైరయ్యారు.

వైద్యసేవలపై ప్రపంచబ్యాంక్ షాకింగ్ రిపోర్ట్
TG· 8 Jul 2026

వైద్యసేవలపై ప్రపంచబ్యాంక్ షాకింగ్ రిపోర్ట్

TG: ఆరోగ్యరంగంలో తెలంగాణ గణనీయంగానే అభివృద్ధి చెందింది. కానీ ప్రజారోగ్య వ్యవస్థ మాత్రం ఇంకా అనేక నిర్మాణాత్మక సమస్యలతో సతమతమవుతోందని ప్రపంచబ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో ఆరోగ్య సేవలను ఇంకా మెరుగుపరచాలని నిర్ణయించింది. తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ హెల్త్‌కేర్ కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పర్యావరణ, సామాజిక వ్యవస్థల అంచనా నివేదికలో ప్రపంచ బ్యాంక్ ఈ అంశాలను ప్రస్తావించింది. తెలంగాణలోని గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదని వెల్లడించింది.

గురుకులంలో ర్యాగింగ్ కలకలం
TG· 7 Jul 2026

గురుకులంలో ర్యాగింగ్ కలకలం

TG: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. దహెగాం మండలానికి చెందిన ఓ విద్యార్థిని గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత బాలికను కొందరు విద్యార్థినులు అడ్డుకున్నారు. తమను గుర్తుపట్టకుండా ముఖంపై దుప్పటి కప్పి నోట్లో పెన్ను క్యాప్ వేసి బలవంతంగా నీళ్లు తాగించారు. క్యాప్ కడుపులోకి వెళ్లడంతో విద్యార్థిని ఎస్‌వోకు సమాచారం అందించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్స్ క్యాప్‌ను బయటకు తీశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు.

భారీ భూస్కామ్.. బోర్డు తీసేసి రియల్టర్ దందా
TG· 7 Jul 2026

భారీ భూస్కామ్.. బోర్డు తీసేసి రియల్టర్ దందా

TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్‌లోని 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని గతంలో ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని అమ్మడం, కొనడం నేరం. అయితే అసైనీల వద్ద ఉండాల్సిన భూమిలో 12 ఎకరాలు ఇటీవల ఓ రియల్టర్ చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ప్రభుత్వ భూమి అనే పెద్ద నోటీసు బోర్డు కూడా ఉండేది. ఇటీవల బోర్డు తీసేసి పట్టా భూమిగా మార్చేశారు. రూ.200 కోట్ల విలువైన భారీ భూకుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.

ధరణి స్కామ్‌లో అధికారులకు నోటీసులు
TG· 7 Jul 2026

ధరణి స్కామ్‌లో అధికారులకు నోటీసులు

TG: ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన అక్రమాలపై సిట్ తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమాల వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాతిపదికన సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించింది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి నోటీసులు జారీచేశారు.

హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్
TG· 5 Jul 2026

హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్

TG: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని హైదరాబాద్-విజయవాడ హైవేపై అతివేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిట్యాల పోలీసులు తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. నేషనల్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ACBకి పట్టుబడిన DSP కేసులో కొత్త ట్విస్ట్
TG· 4 Jul 2026

ACBకి పట్టుబడిన DSP కేసులో కొత్త ట్విస్ట్

TG: ACBకి పట్టుబడ్డ DSP భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.200 కోట్ల ఆస్తుల వ్యవహారంపై ED, IT శాఖలు దృష్టిపెట్టాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భీమ్‌రెడ్డి భారీగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, కేసు ఫైళ్ల కాపీలను తమకు అందజేయాలని ACBని ED అధికారులు కోరారు. ఏసీబీ గుర్తించిన 18 స్థిరాస్తుల్లో 75శాతం బినామీల పేరిటే ఉన్నాయని తేలింది. మరోవైపు DSP భీమ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టడంపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన అస్వస్థతకు గురవడంతో వైద్యపరీక్షలు చేయించి వదిలిపెట్టామని, విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని ACB అధికారులు తెలిపారు.