Latest

16 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం
TG: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనంద్‌పూర్ వద్ద పెన్‌గంగా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జిపై వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ–మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని దాదాపు 16 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు
AP: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఈరోజు, రేపు సెలవులు ప్రకటించారు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆ సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్ బస్సులను వాడనున్నారు. దీంతో రెండు రోజుల పాటు ఆ స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి సత్యదేవ్ డార్క్ కామెడీ థ్రిల్లర్
సత్యదేవ్ హీరోగా, వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావు బహదూర్’. జులై 3న థియేటర్లలో విడుదలై సైకాలజికల్ డార్క్ కామెడీతో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పరిమిత వసూళ్లను మాత్రమే సాధించింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ఈరోజు (జులై 31) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రసారం కానుంది. డిఫరెంట్ కంటెంట్, మిస్టరీ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం ఇది కచ్చితంగా నచ్చే చిత్రమవుతుంది.

లంక గ్రామాలకు రాకపోకలు బంద్
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద వరద ఉధృతికి తాత్కాలిక మట్టి గట్టు కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపాలెం, గంటిపెదపూడి లంక గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు, అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు తగ్గే వరకు నాటు పడవలే ఏకైక రవాణా మార్గంగా మారాయి.

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం
ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలు చేస్తున్నారు. మీ అకౌంట్లో రూ.38,500 వేశామని, ఆ డబ్బులు మీకు రావాలంటే ముందు ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాలని అడుగుతున్నారు. ఇలాంటి కాల్స్ అస్సలు నమ్మకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్లో పడతాయి కానీ, అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి డబ్బులు అడగరు. మీ ఫోన్ పే లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకండి అని పోలీసులు సూచిస్తున్నారు.

గణేష్ విగ్రహాల తయారీపై సజ్జనర్ కీలక ఆదేశాలు
TG: గణేష్ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేందుకు నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ విగ్రహ తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వారితో చర్చించారు. గత ఏడాది గణేష్ విగ్రహాల రవాణా సమయంలో నాలుగు ప్రమాదాలు జరిగినట్లు గుర్తు చేశారు. ఈసారి అలంటి ప్రమాదాలు జరగకుండా గణేష్ విగ్రహాల ఎత్తును 16 అడుగులకు మించరాదని తయారుదారులకు సజ్జనర్ సూచించారు.

డేటింగ్ యాప్స్ తో HIV ముప్పు
ఒక ఉమెన్ గైనకాలజిస్ట్ యువతకు షాకింగ్ నిజం చెప్పారు. డేటింగ్ యాప్స్ ద్వారా ఏర్పడే పరిచయాలతో చాలామంది యువత HIV, STD (సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్) లాంటి ప్రాణాంతక రోగాలు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా 19, 20 ఏళ్ల అమ్మాయిలు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లతో హాస్పిటల్ కు వస్తున్నారట. కాసేపు ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆమె చెప్పారు.

భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య
TG: ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న మంచాల మండలం నోముల గ్రామంలో బాబు అనే వ్యక్తి ఫిబ్రవరి 24, 2026న తన భార్యను దారుణంగా చంపేశాడు. ఆ రోజు నుంచి అతడు ఊరికి దూరంగా ఉంటున్నాడు. అయితే, గురువారం రాత్రి తన భార్య సమాధి పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. భార్యను చంపిన అతడే ఆమె సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకోవడం స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

250 రోజుల్లో ‘వారణాసి’.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారా?
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్‌కు సరిగ్గా మరో 250 రోజుల సమయం మాత్రమే ఉండటంతో,అనుకున్న తేదీకే విడుదల చేసి ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తారో లేదో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాలుగోసారి ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో ప్రధాని మోదీ
పేపర్ లీక్స్, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే సమస్యలపై పీఎం నరేంద్ర మోదీ వారం రోజుల్లో నాలుగోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు, 2026ను ప్రశంసించారు. లీక్‌లకు లీక్‌లకు శిక్షలను పెంచడం వంటి కేసులను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షా వ్యవస్థను విశ్వసనీయంగా మార్చడంలో దీని ఆమోదం ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయనన్నారు.

రైలెక్కేలోపే నిందితురాలికి షాక్
TG: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రూ.26 లక్షల చోరీ కేసులో మరో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తగరం శంకర్‌ను నిన్న అరెస్ట్ చేయగా, ఆయన సన్నిహితురాలు ఆడెపు రేష్మాను తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చోరీ చేసినట్లు అంగీకరించింది. శంకర్‌తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్‌లో దాచిన రూ.26 లక్షల నగదును దొంగిలించినట్లు ఒప్పుకుంది. పరార్ అయ్యేందుకు రైలు కోసం వేచి ఉండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

‘స్పైడర్ మ్యాన్’కు తొలిరోజు భారీ కలెక్షన్లు!
టామ్ హాలండ్ కథానాయకుడిగా నటించిన ‘స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే’ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రికార్డు సృష్టించింది. మొదటి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏకంగా ₹72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. ఇందులో ఇంగ్లిష్ వెర్షన్ ₹32.25 కోట్లు, హిందీ వెర్షన్ ₹22 కోట్లు రాబట్టాయి. దీంతో మన దేశంలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. గతంలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సాధించిన ₹65 కోట్ల రికార్డును దాటేసింది.

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రికార్డ్!
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం థియేటర్లలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2026 సంక్రాంతి (జనవరి 12) విడుదలైన ఈ సినిమా, కడప జిల్లా యర్రగుంట్ల లోని 'హేమ పిక్చర్ ప్యాలెస్' లో విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు త్వరగా ఓటీటీ బాట పడుతున్న రోజుల్లో కూడా, ఈ చిత్రం ఇప్పటికీ రోజూ 4 ఆటలతో నడుస్తూ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

జిల్లా మైనింగ్ AD సస్పెండ్
AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ పురుషోత్తంకు బాధ్యతలు అప్పగించారు. అక్రమ క్వారీ అనుమతులపై విచారణ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తవ్వకాల అనుమతులను రద్దు చేసి, పంచదార్లను 'నో మైనింగ్ జోన్'గా చర్యలు చేపట్టాలని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర పెద్ది: CM
TG: నర్సంపేట మాజీ MLA, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల CM రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

చింతూరు ఏజెన్సీలో హైఅలర్ట్
AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా చేరడంతో నదీ ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. శబరికి అనుసంధానమైన కుయుగూరు, చీకటి, సోకిలేరు, చంద్రవంక వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నది పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా నదులు, వాగుల వద్దకు వెళ్లొద్దని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

పారదర్శకంగా సంక్షేమ పథకాలు: పొంగులేటి
TG: ప్రజాసంక్షేమం, సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

విద్యుత్ వైర్లపై కూలిన ఐరన్ రాడ్లు
TG: హైదరాబాద్ IS సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుతినగర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న భవనానికి అమర్చిన భారీ సెంట్రింగ్ ఐరన్ రాడ్లు ఒక్కసారిగా కూలి విద్యుత్ మెయిన్ వైర్లపై పడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు భవనంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ఇచ్చినా విద్యుత్ శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీనియర్ గాయని జమునారాణి కన్నుమూత
ప్రముఖ సీనియర్ గాయని జమునారాణి(88) బెంగుళూరులో కన్నుమూశారు. 1946లో 'త్యాగయ్య' సినిమాతో బాలగాయనిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో 5 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో 'మామ మామ మామా' పాటతో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగులో ఆఖరిగా 'మిథునం' సినిమాలో 'ఎవరు గెలిచారిప్పుడు' పాట పాడారు.

ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు కొత్త సూచనలు
TG: సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్ల నీటి వినియోగానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఆరుతడి, స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోయా: KCR
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ MLA, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత KCR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, ఆప్త మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం BRSకు తీరని లోటని పేర్కొన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు.