Latest

ఆసుపత్రికి వెళ్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవం
TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తండాకు చెందిన కొమురె అనసూయకు పురిటి నొప్పులు రావడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే అనసూయ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 ఈఎంటీ మునీందర్ గౌడ్, పైలెట్ మహేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
TG: రాష్ట్రంలో రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు మంచిర్యాల సబ్ కలెక్టర్ రాములుకు వినతిపత్రం అందజేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కోడిపందేలు ఆడుతూ ఏడుగురు అరెస్ట్
TG: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం వెంకంపేట శివారులో కోడిపందేలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కోడిపందేలు ఆడుతూ పట్టుబడిన ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. రూ.2 లక్షల సొంత పూచీకత్తుపై బాండ్లు తీసుకున్నారు. ఘటనలో పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే రౌడీషీట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

మైనింగ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
TG: జోగులాంబగద్వాల జిల్లా గట్టు మండలంలో భారత్‌మాల పథకంలో భాగంగా జరుగుతున్న రహదారి పనులకు సంబంధించిన క్రషర్ కార్యకలాపాలపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. సల్కాపురం, జోగన్‌గట్టు గ్రామాల శివారులో మెగా కంపెనీకి సంబంధించిన సబ్‌కాంట్రాక్ట్ క్రషర్ ఐదేళ్లుగా కొనసాగుతోందని సీపీఎం నాయకుడు నర్సింహులు తెలిపారు. సల్కాపురం గ్రామానికి చెందిన రైతు ఏసన్నకు చెందిన రెండున్నర ఎకరాల పొలంలో బోరుబావి ఉందన్నారు. క్రషర్ నుంచి వెలువడుతున్న కంకర, దుమ్ము, బ్లాస్టింగ్ ప్రభావంతో బోరుబావి పూడిపోయిందని ఆరోపించారు.

నీతులు చెప్పిన కంగనా.. రివర్స్ లో పాత ఫోటోలతో ట్రోలింగ్!
నటి కృతి సనన్ నటించిన GIVA <a href="https://www.theclearcutnews.com/n/JMKPmWX">రక్షాబంధన్ యాడ్</a>లో ఆమె వేసుకున్న మోడరన్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. పండుగకు ఇలాంటి గ్లామరస్ బట్టలు ఏంటంటూ కంగనా రనౌత్ విమర్శించగా, బ్రాండ్ ಆ యాడ్‌ను ఉపసంహరించుకుంది. దీనిపై కృతి స్పందిస్తూ.. సంస్కృతి అనేది వేసుకునే బట్టల నెక్-లైన్‌లో ఉండదని కౌంటర్ ఇచ్చారు. నెటిజన్లు మాత్రం గతంలో కంగనా వేసుకున్న డ్రెస్సుల ఫోటోలను షేర్ చేస్తూ ఆమె డబుల్ స్టాండర్డ్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

పేదల గుడిసెలకు పట్టాలివ్వాలి.. వరంగల్‌లో సీపీఎం ధర్నా
TG: వరంగల్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెలకు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ, నిరుపయోగ స్థలాల్లో ఏళ్ల తరబడి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎర్రజెండాలు చేతబూనిన పేదలు, మహిళలతో కలిసి నాయకులు కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు.

సెప్టెంబర్ 2 నుంచి బీఆర్‌ఎస్ పోరుబాట
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజాసమస్యలను పట్టించుకోకుండా అసమర్థ పాలన సాగిస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారంరోజుల పాటు ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో జాప్యం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు.
ఢిల్లీ పోలీసులపై అభిజీత్ ఫైర్!
ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై మూవింగ్ బస్సులో <a href="https://www.theclearcutnews.com/n/c439QZ9">గ్యాంగ్‌రేప్</a> జరగడం, బస్సు 47 కిలోమీటర్లు తిరిగినా పోలీసులు కాపాడలేకపోవడంపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్‌పై వేలమంది పోలీసులతో లాఠీఛార్జ్ చేసే గవర్నమెంట్, విమెన్ సేఫ్టీ విషయంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయిందని మండిపడ్డారు. దేశ రాజధానిలోనే రక్షణ లేకపోతే, మన దేశంలో గర్ల్స్ ఎప్పుడు సేఫ్‌గా ఉంటారంటూ ప్రశ్నించారు.
పనులు చేయించుకున్నారు, బిల్లులు చెల్లించడం లేదు
AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీకి చెందిన కాంట్రాక్టర్ సురవరపు సత్తిరాజు పురపాలక అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లుగా పురపాలికలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో వైఎస్సార్ గార్డెన్స్‌లో రూ.7 లక్షలతో రోడ్డు నిర్మించానని, ఆ పనికి సంబంధించిన బిల్లుల కోసం ఇంజినీరింగ్ అధికారులు ఎంబుక్‌లు నమోదు చేసుకున్నా చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.

గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ నిరసన
TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఛత్తీస్‌గఢ్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీ ర్యాలీ అనంతరం బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడాన్ని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రశ్నించారని తెలిపారు.

రాజ్‌ఠాకూర్ కృషిని ఓర్వలేకే విమర్శలు: కాంగ్రెస్
TG: పెద్దపల్లి జిల్లా రామగుండం అభివృద్ధిపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ చేస్తున్న కృషిని రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, గట్ల రమేష్ అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ విమర్శలు చేయడాన్ని ఖండించారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావాలి: రాజ్‌ఠాకూర్
TG: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు సమస్యలు ఎదురైన సమయంలో కేసీఆర్ బాధిత ప్రాంతాలకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అంటే పదవి, జీతం, ప్రభుత్వ సదుపాయాలు అనుభవించడం మాత్రమే కాదని, ప్రజల మధ్య నిలబడి వారి సమస్యలపై పోరాడే బాధ్యత కూడా ఉందన్నారు.

సోనియా బుక్‌లో సెన్సార్ కట్స్.. డీల్ క్యాన్సిల్!
సోనియా గాంధీ రాబోయే ‘Belonging’ బుక్‌లోని పలు చాప్టర్స్‌లో చేంజెస్, కట్స్ చేయాలని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా లాయర్లు చెప్పారు. PM మోదీ పాలన, RSS పాత్ర, చైనాతో గల్వాన్ ఘర్షణ, మైనారిటీల పరిస్థితి వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రెండు నెలలుగా చర్చలు జరిగాయి. కానీ సెన్సార్ చేసిన ఇండియా వెర్షన్‌ను పబ్లిష్ చేయడానికి సోనియా వర్గం ఒప్పుకోకపోవడంతో ఈ పబ్లిషింగ్ డీల్ క్యాన్సిల్ అయింది. అయితే ఎలాంటి ఎక్స్‌టర్నల్ ప్రెజర్ లేదని పబ్లిషర్ క్లెయిమ్ చేశారు.

హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
TG: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముధోల్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు పోలీసులను కోరారు. నిర్మల్ జిల్లా ముధోల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకి ఎస్సీ సెల్ అధ్యక్షుడు జోందలే నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన అనంతరం హల్ద్వానీలోని రామలీలా మైదానాన్ని కొందరు శుద్ధీకరణ చేశారన్న ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఎండలో నిలబెట్టి విద్యార్థిని బలి తీసుకున్న టీచర్!
ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ సర్వోదయ కన్యా విద్యాలయంలో దారుణం జరిగింది. బుక్ తెచ్చుకోలేదని టీచర్ ఎండలో నిలబెట్టడంతో 10 ఏళ్ల విద్యార్థిని చనిపోయింది. ఆగస్టు 27న స్కూల్ నుంచి కాల్ రావడంతో వెళ్లి చూడగా పాప ఎండలో నిలబడి కండిషన్ క్రిటికల్‌గా ఉన్పట్లు తల్లి అంజలి తెలిపింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించినా ట్రీట్మెంట్ పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇన్సిడెంట్‌పై ఢిల్లీ గవర్నమెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చి, సదరు టీచర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది.

దర్శనం చేసుకుని వస్తుండగా జీపు బోల్తా
TG: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రావణమాసం సందర్భంగా కైలాష్ టేక్డీ, సాసర్‌ఖండ్ దర్శనానికి వెళ్లిన 19మంది భక్తులు జీపులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని తొటంబ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో గంగన్న (70), సాయిలు (69), ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ తులసిరామ్ (26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు గాయపడగా భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బీసీ గురుకులంలో కనీస సౌకర్యాలు కరువు
TG: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బీసీ బాలుర గురుకులంలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ గురుకులంలో సరిపడా బెంచీలు లేక 5వ నుంచి 7వ తరగతి విద్యార్థులు నేలపైనే కూర్చొని చదువుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆటస్థలం కూడా లేకపోవడంతో వారి మానసిక, శారీరక వికాసంపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రష్యా సైన్యంలో 51 మంది భారతీయులు మృతి
రష్యా సైన్యంలో చేరిన భారతీయుల విషయంలో షాకింగ్ వివరాలు బయటకొచ్చాయి. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరారు. వీరిలో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 139 మందిని సైన్యం నుంచి విడుదల చేశారు. ఇంకా కొంతమంది రష్యా సైన్యంలో ఉన్నారు. వారిని కూడా విడుదల చేసి భారత్‌కు తీసుకురావడానికి రష్యాతో చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అసలు వీరంతా రష్యా సైన్యంలోకి ఎలా వెళ్లారు అనేదే ఇప్పుడు చర్చగా మారింది.

ఇండస్ వాటర్‌పై భారత్ తగ్గడం లేదు!
ఇండస్ వాటర్ ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని 2025లో భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగా హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఈ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని తీర్పు ఇచ్చింది. దీనిపై భారత్ మాత్రం కోర్టుకు ఈ విషయంలో ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసి, తన నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. దీంతో భారత్–పాకిస్థాన్ మధ్య నీటి వివాదం మరింత తీవ్రతరమైంది. ఈ తీర్పు జమ్మూ కశ్మీర్‌లోని రాట్లే హైడ్రో ప్రాజెక్ట్‌పై కూడా ప్రభావం చూపనుంది.

సెమీకండక్టర్లకు తెలంగాణే బెస్ట్: శ్రీధర్‌బాబు
TG: సెమీకండక్టర్ తయారీకి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఎదుగుతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మన్ కంపెనీలను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్ (GIBA) ప్రతినిధులను కోరారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో GIBA ప్రతినిధులు మంత్రిని కలిశారు. సెమీకండక్టర్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

ఢిల్లీలో ఓటర్ల లిస్ట్ నుంచి 47.7 లక్షల పేర్లు తొలగించారా?
ఢిల్లీలో ఓటర్ల లిస్ట్‌లో భారీ మార్పులు ఇప్పుడు చర్చగా మారాయి. ఇప్పటివరకు ఉన్న 1.45 కోట్ల మంది ఓటర్లలో 47.7 లక్షల మంది పేర్లు కొత్త SIR డ్రాఫ్ట్ లిస్ట్‌లో కనిపించలేదు. వీరిలో చాలామంది ఇల్లు మారినవారు లేదా అందుబాటులో లేనివారిగా గుర్తించారు. కొంతమంది పేర్లు డూప్లికేట్‌గా, మరికొన్ని మరణించినవారివిగా గుర్తించారు. అయితే ఇది ఇంకా ఫైనల్ లిస్ట్ కాదు. పేరు కనిపించని అర్హులైన ఓటర్లు సెప్టెంబర్ 30 వరకు తమ పేరు మళ్లీ చేర్చాలని క్లెయిమ్ చేసుకోవచ్చు.