Latest

వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి.. లాకర్ ఖాళీ చేసి
TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్‌లో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. రాత్రి దుండగులు వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి లోపలికి ప్రవేశించి, లాకర్‌లో భద్రపరిచిన కిలోకు పైగా బంగారు ఆభరణాలను అపహరించారు. సూరత్‌కు చెందిన ఓ జ్యువెలరీ వ్యాపారి బంజారాహిల్స్‌లోని ఈ ఎక్స్‌పోర్టు కార్యాలయ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం సిద్ధంగా ఉంచిన 7 నెక్లెస్‌లు, 7జతల విలువైన చెవిపోగులను దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు
కూతురు సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సితారను ముద్దాడుతున్న క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ ‘నువ్వు ఎంత పెద్దదానివైనా ఎప్పటికీ నా చిన్న నక్షత్రానివే. హ్యాపీ 14 సితార. వచ్చే ఏడాదంతా నీకు అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. లవ్ యు ఆల్వేస్’ అని రాశారు. అభిమానులు, సినీ ప్రముఖులు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.

రౌడీషీటర్ దాడిలో ఇంటర్ విద్యార్థి హతం
TG: హైదరాబాద్ నగరం కాలాపత్తర్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. శాలిబండలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఫైజాన్(18) ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి బిర్యానీషాటెక్రీ కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడకు వచ్చిన బాలాపూర్ రౌడీషీటర్ అబ్రార్, అతని స్నేహితులను తమ బస్తీకి ఎందుకు వచ్చారని ఫైజాన్ అడిగాడు. కోపానికి గురైన గ్యాంగ్ కత్తులతో ఫైజాన్ తల, కడుపులో దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాలైన ఫైజాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు
TG: హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కీలక చర్యలు తీసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు, CCTV ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆరోపణలు నిజమని నిర్ధారించింది. దీంతో ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ NPA నుంచి పంపించేశారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సర్వీస్‌లో తిరిగి జాయినింగ్‌కు సంబంధించిన తుది నిర్ణయం DOPT తీసుకుంటుందని పోలీస్ అకాడమీ అధికారులు వెల్లడించారు.

ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడల్ విద్యార్థి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో బీటెక్(ఎలక్ట్రికల్)లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించిన ఆనంద్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. పవర్‌గ్రిడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం రైల్వేస్, బ్యాంకులు, SSC రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాశాడు. అయినా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. "సారీ నాన్నా..ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించినా సాధించలేకపోయాను. నన్ను క్షమించండి" అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
TG: హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు SR నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తోటి మహిళా ట్రైనీపై అతడు అసభ్యకరమైన మెసెజెస్ పంపడం, బెదిరింపులకు పాల్పడడం, వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు BNS పలు సెక్షన్లు, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై సీనియర్ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వాహనదారులకు గుండెపోటు తెప్పిస్తోందని నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సానుభూతిపరుడైన తన మిత్రుడు కొత్తగా కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీకి ఇథనాల్ పెట్రోల్ వాడటంతో ఇంజిన్ వాల్వ్స్ దెబ్బతిన్నాయన్నారు. అందుకే తనూ లీటరుకు రూ.165 ఖర్చుతో హై ఆక్టేన్ 100 పెట్రోల్‌కు మారాల్సి వచ్చిందని చెప్పారు. సాధారణ వాహనదారుల పరిస్థితి ఏంటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి
AP: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని టీడీపీ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు. ప్రూఫ్స్ చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మాధవి పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
సీజేపీ నిరసన.. AAP లీడర్ రాయ్ పిలుపు
దిల్లీలో సీజేపీ ర్యాలీ ముందు AAP లీడర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నాయన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్ల దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు అంధకారంలో పడుతోందని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. సోనమ్ వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్‌ను ప్రభుత్వం బలవంతంగా నిలిపేసిందని ఆరోపించారు.

పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను ప్రారంభించి మరణించిన ఎంపీలకు సంతాపం తెలిపారు. వారి గురించి సభకు వివరించారు. మాజీ ఎంపీ నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతాపం తెలిపారు. ఇవాళ పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. పార్లమెంట్ వరకు సీజేపీ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అనుమతి లేదంటున్నా ఆగని సీజేపీ ర్యాలీ
నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా దిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి సీజేపీ పిలుపునిచ్చింది. అయితే జంతర్ మంతర్ నుంచి బయటకు వచ్చే మార్గాలన్నీ పోలీసులు మూసేశారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ర్యాలీకి అనుమతులు లేవంటున్నారు. సీజేపీ మద్దతుదారులని అడ్డుకుంటున్నారు. అయినా సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, యువకులు, విద్యార్థులు ర్యాలీని కొనసాగిస్తున్నారు.
దిల్లీలో సంసద్ మార్చ్ ప్రారంభం
దిల్లీలో భారీ వర్షం ఉన్నపటికీ సీజేపీ ఆధ్వర్యంలో సంసద్ మార్చ్ ప్రారంభమైంది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మార్చ్‌కు ముందస్తు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా విద్యార్థులు ర్యాలీని కొనసాగిస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంట్ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భద్రతా దళాలను మోహరించారు.

జెండా చిరిగిపోయినా స్పందించని అధికారులు
TG: హైదరాబాద్‌లోని నాగోల్ మూసీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా చిరిగిపోయి నేలపై పడిపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇనుప గొలుసులు(రోప్స్) తెగిపోవడంతో జెండా కింద పడిపోయినా, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేదని స్థానికులు ఫైరయ్యారు. దాదాపు వారం క్రితమే కింద పడ్డా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా వదిలేశారని విమర్శిస్తున్నారు. స్తంభానికి మరమ్మతులు చేపట్టి, కొత్త జెండాను ఆవిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నిరాహార దీక్ష విరమణకు వాంగ్చుక్ 3 కండీషన్స్
దిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన దీక్ష విరమించడానికి 3 కండీషన్స్ పెట్టారు. 1. NEET పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి 2. CJP నాయకులు పార్లమెంటు దగ్గరికొచ్చి వివరించే విషయాలను పార్లమెంటులో చర్చిస్తామని హామీ ఇవ్వాలి 3. నా ఆరోగ్యం సహకరించకపోతే ఎంపీలే హాస్పిటల్‌కు వచ్చి హామీ ఇవ్వాలి. అప్పుడే నేను దీక్షను విరమిస్తాను అని వాంగ్చుక్ టిష్యూ పేపర్ మీద రాసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
TG: రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, పదవులు ఎవరికి, ఎప్పటికి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా అల్లీపూర్ నుంచి రంగనాయకసాగర్ వరకు రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు నీటి కోసం నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరం మోటర్లను వెంటనే నడిపించి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నది సహజ కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల వచ్చిన కరువని ఫైరయ్యారు.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ సమయానికి హాజరు కాకపోవడం, విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో స్టూడెంట్స్ చదువు దెబ్బతింటోందని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

MLA ఇంటి ముట్టడికి పిలుపు.. హౌస్ అరెస్టులు
TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో BJP, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ‘ఛలో అంకాపూర్’ కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆర్మూర్, అంకాపూర్ ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు, బంద్‌లను నిషేధించారు. MLA పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వగా, దాన్ని అడ్డుకునేందుకు BJP కార్యకర్తలను అంకాపూర్‌కు తరలిరావాలని నేతలు పిలిచారు. దీంతో ఇరు పార్టీల నేతలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, పలువురిని హౌస్ అరెస్ట్ చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు మిస్సింగ్
TG: హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు ఆకస్మికంగా అదృశ్యమవడం కలకలం రేపుతోంది. దోమలగూడలో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలకు చెందిన స్నేహ, లలిత, లత ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించగా, బాలికలు హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగినట్లు గుర్తించారు. వారు ఛత్తీస్‌గఢ్ వెళ్లారా లేదా ఇతర ప్రాంతానికి వెళ్లారా అనే కోణంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.

పండుగ ఆనందం క్షణాల్లో విషాదం
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా గుర్రాలపాలెం గ్రామస్థులు పాడేరు అమ్మవారి పాదాల వద్ద పండుగ చేసుకుని తిరిగి వస్తుండగా, పాడేరు ఘాట్ రోడ్డులోని కోమలమ్మ పనుకు మలుపు వద్ద బొలెరో వ్యాన్ బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. ప్రమాదంలో దివి చలపతిరావు స్పాట్‌లోనే మృతి చెందగా, సూరిశెట్టి అప్పారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డ్
భారత స్టార్ షట్లర్ PV సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె జపాన్‌కు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగూచిని 21-17, 21-17 తేడాతో వరుస గేమ్‌ల్లో ఓడించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. 2024 డిసెంబరులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ తర్వాత టైటిల్ గెలవకపోవడంతో వచ్చిన విమర్శలకు ఈ విజయంతో ఆమె గట్టి సమాధానం ఇచ్చింది. సింధుకు CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

వృద్ధాశ్రమానికి తీసుకెళ్తానని కాల్వలో నెట్టేసి, తాను దూకి
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మీసాల సూర్యవతి (60) తన తల్లి బూరమ్మ (80)ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లింది. రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్ద ఉన్న పెద్ద వంతెనపైకి చేరుకున్న తర్వాత బూరమ్మను కాల్వలోకి నెట్టివేసింది. అనంతరం ఆమె కూడా నీటిలోకి దూకింది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించగా, అప్పటికే సూర్యవతి మృతదేహం లభించింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బూరమ్మ గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.