Latest

వాగు దాటబోయి ప్రాణాలు కోల్పోయిన మహిళ
TG: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బల్లివాగులో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చామన్‌పల్లి గ్రామానికి చెందిన మర్సుకోల పారుబాయి మృతి చెందింది. పెన్షన్ డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.

ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% మన దేశంలోనే
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ ముఖ్యమైన విషయాలు చెప్పింది. పులులను కాపాడటం అంటే కేవలం ఒక జంతువును రక్షించడం కాదని, మన అడవులు, నదులు, మొత్తం పర్యావరణాన్నికాపాడుకోవడమే అని తెలిపింది. ప్రధాని మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% మన దేశంలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అని అయన 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు!
TG : నిర్మల్, కుమ్రం భీమ్ జిల్లాల్లో రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ, రోడ్లపైకి భారీగా వరద చేరుతోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆర్డర్స్ జారీ చేశారు. కుమ్రం భీమ్ జిల్లాలో DEO హాలిడే డిక్లేర్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు రావాలని అధికారులు చెప్పారు.
నడిరోడ్డులో మహిళపై పోలీసులు దాడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్‌లో ఓ యువకుడి హత్య కేసులో నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. యువకుడి డెడ్‌బాడీని రోడ్డుపై ఉంచి గొడవకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ ఎక్కువవడంతో పోలీసులు అక్కడికి చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీఛార్జ్ చేశారు. ఈ నిరసనలో ఉన్న ఓ మహిళలపై కూడా పోలీసులు లాఠీలతో దాడి చేశారు.

ప్రేమ వివాదంతో యువకుడి ఆత్మహత్య
AP: చోడవరంలోని ద్వారకానగర్లో లక్కరాజు ప్రశాంత్(23) బీటెక్ పూర్తి చేసి GATE పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయితో గొడవ జరగడంతో బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అతనికి తల్లి, తాపీ పని చేసే తండ్రి నాయుడు, ఒక సోదరుడు ఉన్నారు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. SI జోగారావు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

గంజాయి తాగిన యువకులకు పోలీసులు షాక్
TG: LBనగర్‌లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం PS పరిధిలోని సాహెబ్‌నగర్ బాల్‌రెడ్డి గ్రౌండ్ సమీపంలో దాడిచేసి పట్టుకున్నారు. చింతల్‌కుంట సరస్వతీనగర్‌కు చెందిన గుర్రపు హర్ష్ రోహిత్, వనస్థలిపురం పోలీస్ కాలనీకి చెందిన కోట కృపాకర్ గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్నేహితుల ప్రభావంతోనే గంజాయికి అలవాటు పడ్డామని విచారణలో వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

CM ఉన్న విమానం గాల్లోనే చక్కర్లు.. ఉత్కంఠ
TG: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న CM రేవంత్ రెడ్డికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి తుది క్లియరెన్స్ అందకపోవడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి చివరికి సేఫ్‌గా దించారు. రన్‌వేపై ల్యాండింగ్ ప్రయత్నాన్ని నిలిపివేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

4 మెగా ఇండస్ట్రియల్ పార్కులు
TG: హైదరాబాద్ శివారులో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద చర్యలు వేగవంతమయ్యాయి. తొలి దశలో తిమ్మాపూర్, ఎలిమినేడు, మాదారం, దండుమైలారం ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. త్వరలో కేంద్రానికి DPR సమర్పించనున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 16 ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చెరువులో మునిగిన ఇద్దరు చిన్నారులు
AP: పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తోటి విద్యార్థులతో కలిసి చెరువు వద్దకు వెళ్లిన బమ్మిడి శివ, కొడవటికంటి కిరణ్ ఈత కొడుతుండగా లోతైన నీటిలో చిక్కుకుని మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం
హైదరాబాద్ చైతన్యపురిలోని న్యూమారుతీనగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భట్టు స్వరాజ్‌కుమార్ షేర్ మార్కెట్‌లో భారీ లాభాల పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.74 లక్షలు కోల్పోయారు. ఆల్ఫా ఇన్వెస్టర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించిన నిందితులు నకిలీ లాభాల వివరాలు చూపించి బాధితుడిని నమ్మించారు. దశలవారీగా పెట్టుబడులు పెట్టించిన తర్వాత డబ్బు విత్‌డ్రా చేసేందుకు మరిన్ని చెల్లింపులు కోరడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది: సింగిరెడ్డి
TG: రాష్ట్రంలో కరువు ఎల్‌నినో వల్ల కాదు, కాంగ్రెస్ పాలన వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసిందని, రైతుల ప్రయోజనాలను విస్మరించిందని అన్నారు. వరద నీటిని సక్రమంగా వినియోగించకుండా ఇతర రాష్ట్రాలకు వదిలేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తిచేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం
AP: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం ఏర్పాట్లను నాలుగు సెక్టార్లుగా విభజించి, ఎస్పీజీ, రాష్ట్ర పోలీసులు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. సుమారు 7వేల మంది పోలీసులను మోహరించగా, డాగ్, బాంబ్ స్క్వాడ్, CCTV నిఘాతో తనిఖీలు చేస్తున్నారు.

ఇక ప్రతి 45రోజులకు తప్పనిసరి సమావేశం
TG: ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసేందుకు AICC కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ప్రతి 45రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలని ఆదేశించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మంత్రుల పనితీరును సమీక్షించి లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

నేషనల్ హైవేపై భారీ రాస్తారోకో
AP: పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల వద్ద నిల్వ ఉన్న సరకును కొనుగోలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులు ప్రకాశం జిల్లాలో ఆందోళనకు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో త్రోవగుంట, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పొగాకుపై ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తున్నా రైతులకు న్యాయం జరగడం లేదని నాయకులు ఫైరయ్యారు.

ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
AP: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్-2026 అమలుపై నిర్వహించిన సమీక్షలో మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రెండో దశ నోటిఫికేషన్‌ను సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 15న, మూడో, నాలుగో దశలకు సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
TG: సుప్రీంకోర్టు కీలక తీర్పుతో తెలంగాణలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ బ్యారేజీ, డిండి ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ సుగమమైంది. 2017 నాటి ప్రత్యేక మినహాయింపు నోటిఫికేషన్‌ను సమర్థించిన ధర్మాసనం, భవిష్యత్తులో సాధారణ మినహాయింపులు ఇవ్వకుండా కేంద్రాన్ని ఆదేశించింది. 2021లో జారీచేసిన ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో అనుమతుల ఆఫీస్ మెమోరాండంను రద్దు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.

వెయిట్ లాస్ మందులతో జర భద్రం !
వెయిట్ లాస్ కోసం కొందరు వాడే GLP-1 రకం మందులు కొన్నిసార్లు ఈటింగ్ డిజార్డర్ అయిన అనోరెక్సియాకు (ఆకలి కాకపోవడం) దారితీసే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. బరువు తగ్గించే క్రమంలో ఇవి మెదడులోని ఆకలి సంకేతాలను అణిచివేయడం వల్ల కొందరిలో ఆహారం పట్ల తీవ్ర భయం, విరక్తి ఏర్పడుతున్నాయి.వీటి వాడకంలో సరైన గైడెన్స్ లేకపోతే ఇవి తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

లివర్ ను దెబ్బ తీసే డేంజరస్ హాబిట్స్ ఇవే !
మన శరీరంలో ఎంతో కీలకమైన లివర్ (కాలేయం) ఆరోగ్యం కొన్ని లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. ఓవర్ గా ఆల్కహాల్ తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తో వచ్చే ఫ్యాటీ లివర్, ఓవర్ వెయిట్ లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అలాగే డాక్టర్ సలహా లేకుండా వాడే పెయిన్ కిల్లర్లు, హెర్బల్ సప్లిమెంట్లు కూడా డేంజరే. హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా లివర్ పాడవుతుంది. కాబట్టి సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ లివర్‌ను సేఫ్ గా ఉంచుకోవచ్చు

ఫుడ్ డెలివరీ బోయ్ కి సాహిత్య పురస్కారం !
ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే కవితలు రాసిన 57 ఏళ్ల వాంగ్ జిబింగ్ చైనాలోనే అత్యున్నత లూ క్సున్ సాహిత్య పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. గిగ్ ఎకానమీలో డెలివరీ వర్కర్లు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి జీవన పోరాటం ఆధారంగా ఆయన రాసిన 'లో ఫ్లైట్' (Low Flight) కవితల సంపుటికి ఈ అవార్డు లభించింది. 2019 నుంచి పగలు డెలివరీలు చేస్తూ రాత్రి వేళల్లో 6,000 పైగా కవితలు రాసిన ఆయన ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది. అవార్డు వచ్చినా తను డెలివరీ బాయ్‌గా కొనసాగుతానని ఆయన వెల్లడించారు.

ఉదయ్ కృష్ణా రెడ్డిది దారుణమైన ప్రవర్తన - సీపీ
మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై షాకింగ్ వివరాలు బయటకొచ్చాయి. బాధితురాలిని ఆరు వారాల పాటు వేధించడమేకాక ఆమె ఫోన్ లాక్కుని పాస్ వర్డ్ అడగడం, గదిలో బంధించడం, జుట్టు పట్టుకు లాగడం, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించడం,కత్తితో బెదిరించడం లాంటి దారుణాలకు పాల్పడ్డాడని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆమె ప్రైవేట్ వీడియో రికార్డు చేసి భర్తకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడని అన్నారు. పోలీస్ అకాడమీలో ఇలాంటివి జరగడం కలకలం రేపుతోంది.

ఐఐటీ ఖరగ్ పూర్ లో హైదరాబాద్ ప్రొఫెసర్ ఆత్మహత్య
ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన దీపక్ రెడ్డి పుల్లగురం (36) తన స్టాఫ్ క్వార్టర్స్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసుల సాయంతో తలుపు తెరవగా లోపల ఆయన సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, కేసు నమోదు చేసి ఆత్మహత్య కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.