Latest

శిశు మరణాలపై డీఎంహెచ్ఓ సమీక్ష.. కారణాల విశ్లేషణ తప్పనిసరి!
జగిత్యాల జిల్లాలో శిశు మరణాల నివారణకు అన్ని విభాగాలు సమన్వయంగా పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జి. సుజాత సూచించారు. గురువారం సమీక్షలో హైరిస్క్ గర్భిణీల పర్యవేక్షణ, ప్రసవాలు, నవజాత శిశు సంరక్షణ, అత్యవసర రిఫరల్ సేవలపై చర్చించారు. ప్రతి మరణానికి కారణాలను విశ్లేషించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

లింగంపేట్‌కు గుడ్ న్యూస్.. రూ.4.50 కోట్ల బ్రిడ్జి!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట్‌లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుందుభి నదిపై రూ.4.50 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో గ్రామస్తుల రాకపోకలు సులభతరం కానున్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ యాదవ్, సర్పంచ్ బాలస్వామి, డిప్యూటీ గోపి, కుమార్ నాగరాజు పాల్గొన్నారు.

గంగాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ఎమ్మెల్యే హాజర్!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ గిరి ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సర్పంచ్, మండల అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బైక్‌పై ఇంటింటికీ వెళ్లి చెక్కులిచ్చిన టీడీపీ నేత!
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో అనారోగ్యంతో చికిత్స పొందిన 45 మందికి రూ.38.46 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఆయన బైక్‌పై వెళ్లి ఇంటింటికీ చెక్కులు అందించి, లబ్ధిదారులకు భరోసా కల్పించారు. ఆపదలో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

శ్రీపురం చెరువులో పశుగ్రాస సాగుకు శ్రీకారం..
అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీపురంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గురువారం 25 ఎకరాల్లో పశుగ్రాస సాగును ప్రారంభించారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో పశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 297 ఎకరాలకు అనుమతి ఇవ్వగా, 249 ఎకరాల్లో విత్తనాలు చల్లారు. ఎకరానికి 20 కిలోల ఉచిత విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అధికారి ప్రేమ్ చంద్ తెలిపారు. దీనివల్ల 200 పశువులకు 6 నెలల మేత అందనుంది.

60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం..
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లిలో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం అదే గ్రామానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వి.ఎన్.వి. పవన్ కుమార్ తెలిపారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అమ్రాబాద్ స్కూల్లో కృష్ణాష్టమి సందడి..
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాలకృష్ణులు, గోపికలుగా అద్భుతమైన వేషాల్లో పాఠశాలకు వచ్చి ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని చిన్నారుల ప్రదర్శనలను ఆస్వాదించారు.

2030కి క్విక్ కామర్స్ $70B మార్కెట్
“ఇది కావాలి” అనిపించిన వెంటనే షాప్‌కి వెళ్లకుండా.. ఫోన్లో ఆర్డర్ చేసి నిమిషాల్లో ఇంటికే తెప్పించుకోవడం ఇప్పుడు అలవాటవుతోంది. ఈ మార్పే క్విక్ కామర్స్‌ను పెంచుతోంది. Infisum అంచనా ప్రకారం భారత్‌లో ఈ మార్కెట్ 2030 నాటికి 65–70 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. డార్క్ స్టోర్లు కూడా 2025లో 2,525 నుంచి 2030 నాటికి 7,500కి పెరగొచ్చని అంచనా. కిరాణా సరుకులకే కాకుండా ఎలక్ట్రానిక్స్, బ్యూటీ వస్తువులకూ డెలివరీ పెరగొచ్చు. అంటే రేపటి షాపింగ్‌లో “ఎక్కడ దొరుకుతుంది?” కంటే.. “ఎంత త్వరగా వస్తుంది?” అన్నదే కీలకం.

లక్ష్మణరేఖ దాటితే ఎవరికైనా ఇదే గతి: ఎంపీ మల్లు రవి
నాగర్‌కర్నూల్ ఎంపీ, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతమేనని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రెండుసార్లు వివరణ విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించే బహిరంగ వ్యాఖ్యలు సరికాదని పేర్కొంటూ.. "లక్ష్మణరేఖ దాటితే ఎవరికైనా ఇదే గతి" అంటూ హెచ్చరించారు.

ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యం: సింగరేణి సీఎండీ
బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యమని సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి చెప్పారు. అదే తమ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం జరిగిన 50వ త్రైపాక్షిక భద్రతా సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాద రహిత మైనింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వాడాలని, పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మిక సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పౌడర్ ట్యాంక్‌లో పడి కార్మికుడి మృతి.. పోలీసులు కేసు నమోదు!
Dr. B.R. Ambedkar Konaseema జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలోని రమ్య ఫుడ్స్ కంపెనీలో బుధవారం సాయంత్రం 6 గంటలకు విషాదం చోటుచేసుకుంది. గంటి గ్రామానికి చెందిన గుత్తుల రాజు (23) అనే యువకుడు పౌడర్ ట్యాంక్‌పై విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయి మృతి చెందాడు. స్థానికులు, సహచరులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఏసీబీ ట్రాప్.. రూ.30 వేల లంచంతో బీట్ ఆఫీసర్ రెడ్ హ్యాండ్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రామానుజగూడెంలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ బానోత్ రవికుమార్.. పోడు భూమిలో ట్రెంచ్ వేయకుండా ఉండేందుకు రైతు దగ్గర రూ.30 వేలు డిమాండ్ చేశాడు. మధ్యవర్తి సాదిక్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇది ఈ ఏడాది జిల్లాలో అటవీశాఖలో నాలుగో అవినీతి కేసు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుడుంబా డంప్‌పై పోలీసుల రెయిడ్.. 2,000 లీటర్ల పానకం ధ్వంసం!
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 2,000 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. సీఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో గురువారం జరిగిన దాడిలో ప్లాస్టిక్ క్యాన్లు, డ్రమ్ముల్లో నిల్వ చేసిన పానకాన్ని స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్, రమేష్ రావు, కానిస్టేబుళ్లు శివ, అజిత్, సతీష్, అంజి పాల్గొన్నారు.

స్కూల్లోనే పిల్లలకు భద్రత లేకపోతే.. బాధ్యత ఎవరిది?
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు ప్లాస్టర్ కొంత భాగం కూలి ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలతో భవనం దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. అయితే తల్లిదండ్రులు భవనం చాలా కాలంగా దెబ్బతిన్న స్థితిలో ఉందని చెబుతున్నారు. మరోవైపు, గత వేసవిలో ఇంజినీర్ పరిశీలించి గదులు సురక్షితమేనని నివేదిక ఇచ్చినట్లు అధికారి తెలిపారు. మరి తనిఖీలు జరిగినా ఇలాంటి ఘటనలు ఎందుకు? భద్రతను నిజంగా పరిశీలిస్తున్నారా అన్నదే అసలు ప్రశ్న.

కొందుర్గ్ లో స్మార్ట్ కార్డులు పంచిన ఎమ్మెల్యే శంకర్
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల రైతు వేదికలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పెద్దన్నగా నిలిచి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తోందని, అర్హులకు తక్షణమే కార్డులు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. MRO మీర్ అజమ్ అలీ, MPDO శ్రీరామ, MC చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, PAC చైర్మన్ తుమ్మలపల్లి పాల్గొన్నారు.

SC యూత్ కి జనరిక్ మెడిసిన్ యూనిట్లు ఇవ్వరా? వైసీపీ ప్రశ్న
ప్రభుత్వం కొన్ని వర్గాల నిరుద్యోగ యువతకు జనరిక్ మెడిసిన్ యూనిట్ల కోసం రూ.7.93 కోట్లు కేటాయించినా.. షెడ్యూల్డ్ కాస్ట్ యువతను మినహాయించడం సరైందా? అంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మాల, మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా SC యువతకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయం చేస్తున్నప్పుడు SC యువతను విస్మరించడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అల్లూరులో ANMలపై సస్పెన్షన్ వేటు.. విధుల్లో నిర్లక్ష్యం
పెద్దపల్లి జిల్లా అల్లూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన నలుగురు ANMలపై DMHO డా. వై. పవిత్ర సస్పెన్షన్ వేటు వేశారు. గర్భిణుల నమోదు, ఇమ్యునైజేషన్, కుటుంబ నియంత్రణ, TB, మలేరియా-డెంగ్యూ నియంత్రణ, ఫీల్డ్ విజిట్లలో టార్గెట్లు మిస్ అయ్యాయని, ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం తో సహించబోమని DMHO క్లియర్ చేశారు. గోషిక మహేశ్వరి, ఎస్. శ్రీజ, కోడి సునీత కుమారి, సువర్ణపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు.

నంది మేడారంలో క్రీడా సందడి.. జోనల్ కు షార్ట్‌లిస్ట్!
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడలు ఘనంగా ముగిశాయి. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో పోటీలు జరిగాయి. మండల విద్యా వనరుల అధికారి పి. ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పెద్దపల్లి జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా క్రీడల కార్యదర్శి లక్ష్మణ్, సర్పంచ్ వీరపాలు, ప్రిన్సిపాల్ విజయ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాజాంలో గణేశ్ ఉత్సవాలకు డీజేలకు క్లియర్ నో.. పర్మిషన్ లేదు!
విజయనగరం జిల్లా రాజాం మండలంలో వచ్చే గణపతి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని సీఐ నవీన్ కుమార్ హెచ్చరించారు. శబ్ద కాలుష్యం కారణంగా ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని, ఏ డీజే అయినా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్వాహకులు కట్టుదిట్టమైన నియమాలు పాటించాలని ఆదేశించారు.

గణేశ్ మండపాలకు ఇక ఆన్లైన్లోనే అనుమతి.. ఈ-పోర్టల్ రెడీ!
ఈ వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు గుడ్ న్యూస్. AP పోలీసులు www.ganeshutsav.net పేరిట సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. ఆన్లైన్లోనే పర్మిషన్స్ క్లియర్ చేసుకోవచ్చు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఈ విషయాన్ని క్లియర్ చేశారు. ఇక మండపాల నిర్వాహకులకు టెన్షన్లేదు.. క్లిక్ చేస్తే అనుమతి రెడీ!

బీఆర్ఎస్ ధర్నా.. రైతులకు 24x7 కరెంట్ కావాలి!
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులో రైతుల సమస్యల పరిష్కారం కోసం BRS నాయకులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కరెంట్ కట్స్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని, నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.