Latest

పేద విద్యార్థులకు అంబేద్కర్ గురుకులం అండ
AP: తాడికొండలో ప్రారంభమైన డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ పేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేయనుంది. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు, ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి రావడంతో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా మారనుందన్నారు.

RSS కార్యక్రమంలో పాల్గొన్నందుకు గవర్నమెంట్ టీచర్ల సస్పెన్షన్
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు RSS రూట్ మార్చ్‌లో పాల్గొన్నందుకు సస్పెండ్ చేశారు. కర్ణాటక సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 2021కు వ్యతిరేకమని విద్యాశాఖ పేర్కొంది. యాద్గిర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చన్నబసప్ప ముధోల్ ఈ ఆదేశాలు జారీ చేశారు. హునసగి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ అసిస్టెంట్ టీచర్ గురురాజ్ జోషి, సూర్‌పూర్ తాలూకా కుప్పిలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్ హెడ్ టీచర్ అన్నా సాహెబ్ దేశ్‌ముఖ్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

గ్రీన్ కవర్ పెంచి పర్యావరణ పరిరక్షణ చేద్దాం
AP: రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల ఆరోగ్యకర జీవనానికి గ్రీన్ కవర్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె.నాగబాబు అన్నారు. ప్రస్తుతం 29 శాతంగా ఉన్న గ్రీన్ కవర్‌ను 50 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. మొక్కల సంరక్షణను జియోట్యాగింగ్, డ్రోన్లతో పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్ద చెట్టు తొలగిస్తే పది మొక్కలు నాటే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపును ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.

బిల్లులు ఇవ్వకపోతే స్కూళ్లకు తాళాలు
TG : తెలంగాణలో ‘మన ఊరు - మన బడి’ పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం పై మండిపడుతున్నారు. పనులు పూర్తి చేసి మూడేళ్లవుతున్నా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యామని అంటున్నారు. ఈ విషయమై ఖమ్మం కలెక్టర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. సెప్టెంబర్ 17 లోగా పైసలు రిలీజ్ చేయకపోతే, తాము పనులు చేసిన ప్రభుత్వ స్కూళ్లకు తాళాలు వేస్తామని తెలిపారు.

‘ఇదే నేను పనిచేసే ఆఫీస్’ అని చూపించిన క్షణం
చిన్నప్పుడు మనల్ని స్కూల్‌కి తీసుకెళ్లిన తల్లిదండ్రులనే పెద్దయ్యాక మనం పనిచేసే చోటికి తీసుకెళ్తే ఆ క్షణం ఎలా ఉంటుంది? బెంగళూరులో గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తన తల్లిదండ్రులను తొలిసారి ఆఫీస్‌కి తీసుకెళ్లి, అక్కడి వాతావరణాన్ని చూపించింది. ఆ క్షణాలను వీడియోగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది తల్లిదండ్రుల ముఖంలో కనిపించిన ఆనందం, గర్వమే ఈ వీడియోను ఇంతగా కనెక్ట్ చేసిందంటున్నారు. పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసిన ఈ చిన్న క్షణం నెటిజన్లను బాగా టచ్ చేసింది.
అక్రమంగా గ్యాస్ సిలిండర్ల మార్పిడి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెడబయలు భారత్ గ్యాస్ ఏజెన్సీలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల మార్పిడి జరుగుతున్నట్లు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య గుర్తించింది. ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎంఆర్‌ఓకు తెలియజేసినా చర్యలు తీసుకోలేదని, డీఎస్‌ఓ, జాయింట్ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని తెలిపింది. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడం విచారకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

నల్లబెల్లి ఎంపీడీఓగా రమణారెడ్డి
నల్లబెల్లి ఎంపీడీఓ పింగిలి రమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. పదోన్నతిపై నల్లబెల్లి ఎంపీడీఓగా నియమితులయ్యారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు శాఖాపరమైన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వరుస చోరీలు..పోలీసుల నిఘా ఏదీ?
AP: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో వరుసచోరీలు కలకలం రేపుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలోని స్టీల్ షాప్, బేకరీలో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేల విలువైన వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో చోరీలు జరిగినా పోలీసులు నిఘా పెంచకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిఘా లోపం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Singlesపై RGV క్రేజీ పోస్ట్!
డైరెక్టర్ RGV మళ్లీ ఓ ఇంట్రెస్టింగ్<a href="https://x.com/RGVzoomin/status/2093167410920689707/photo/1"> పోస్ట్</a> పెట్టారు. "ప్రతి సక్సెస్‌ఫుల్ అబ్బాయి వెనుక ఒక అమ్మాయి ఉంటుంది" అనే మాటను ఆయన అస్సలు ఒప్పుకోనని చెప్పారు. సింగిల్‌గా ఉంటూనే లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ సాధించిన వాళ్లు చాలామంది ఉన్నారని ట్వీట్ చేశారు. టాటా, బాటా, APJ అబ్దుల్ కలాం, సల్మాన్ ఖాన్, రాహుల్, యోగి, బాబా రాందేవ్ లను ఎగ్జాంపుల్స్‌గా చూపించారు. సక్సెస్‌కి పెళ్లితో సంబంధం లేదని, సింగిల్స్ కూడా గ్రేట్ అని ప్రూవ్ చేశారని తన పోస్ట్ ద్వారా తెలిపారు.

రూ.100 కోట్ల హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
మమితా బైజు, నివిన్ పౌలీ జంటగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ మలయాళంలో రిలీజైన వారం రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ హిట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
కర్ణాటక మంత్రి రాజీనామా..ఆపై కన్నీళ్లు
కర్ణాటక ప్లానింగ్, గణాంకాల శాఖ మంత్రి బి.నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెడ్డపేరు తేకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. బీజేపీ మనువాద రాజకీయాలకు తను బలయ్యానని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

బీఎస్పీ కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడి నియామకం
బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడిగా ఆదోనికి చెందిన మలిగే రామలింగయ్యను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సామేలును పార్లమెంటరీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు.

భారీగా డ్రై గంజాయి పట్టివేత
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద పోలీసులు భారీగా డ్రై గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి గంజాయిని కారులో రాజమహేంద్రవరం మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా నెట్‌వర్క్‌పై కూడా ఆరా తీస్తున్నట్లు డి.ఎస్.పి జీవన తెలిపారు.

ఆకట్టుకున్న వృక్ష రక్షాబంధన్
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ హరిత దళ క్లబ్(ఎన్జీసీ), జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోని మొక్కలకు రాఖీలు కట్టి వాటిని సోదరీమణుల్లా సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ టి.హేమారావు, ఎస్ఎంసి చైర్మన్ బి.లక్ష్మిపతి, కొయ్యల శ్రీనివాసరావు, ఎన్.మంగరాజు పాల్గొన్నారు.

భార్య చదివిన బడికి..తనవంతు తోడ్పాటు
భార్య తనకు దూరమైనా ఆమె సజీవంగా ఉంచాలన్న సంకల్పం కలిగింది భర్తకు. భార్య చదువుకున్న బడి ప్రాంగణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం లైబ్రరీ, కంప్యూటర్ గదుల నిర్మాణానికి పూనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన వ్యాపారి గంధం ప్రసాద్(బాలరాజు) భూమిపూజ చేసి అందరికీ స్ఫూర్తి పంచారు.

పారిశుద్ధ్య సమస్యలపై అధికారుల దృష్టి సారించాలి
గుండ్లపల్లి గ్రామంలో పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల సమీపంలోని మురికి కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, ఈగలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలతో దుర్వాసన వస్తోందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించి, కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతున్నారు.

అండర్‌వేర్‌ను మట్టిలో ఎందుకు పాతిపెట్టారు? 😳
వినడానికి వింతగా ఉన్నా.. స్విట్జర్లాండ్‌లో 1,000 మంది తమ కాటన్ అండర్‌వేర్‌ను మట్టిలో పాతిపెట్టారు. నేలలో జీవం ఎంత యాక్టివ్‌గా ఉందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇలా చేశారు. రెండు నెలల తర్వాత వాటిని బయటకు తీసి ఎంతవరకు కుళ్లిపోయాయో చూశారు. ఎక్కువగా కుళ్లిపోయిన చోట మట్టిలో ఉండే జీవుల యాక్టివిటీ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. గార్డెన్లలో అండర్‌వేర్ వేగంగా కుళ్లిపోగా.. లాన్లలో నెమ్మదిగా కుళ్లింది. అంటే మనం ఊహించని విధంగా అండర్‌వేర్‌తో కూడా మట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చన్నమాట.

ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చిన కృతి సనన్
యాడ్‌లో వేసుకున్న డ్రెస్, పెట్ డాగ్‌కి రాఖీ కట్టడంపై ట్రోల్స్ చేసిన వాళ్లకు హీరోయిన్ కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజీ పోస్ట్‌తో కౌంటర్ ఇచ్చింది. తన చెల్లెలు నూపుర్ సనన్ తో ఒకరికొకరు రాఖీ కట్టుకున్న పిక్ షేర్ చేస్తూ, 'రాఖీ ఫ్యాషన్ కమిటీ ఇంకా డిస్కషన్‌లోనే ఉన్నట్టుంది. కానీ మేము మాత్రం రియల్ ఎమోషన్స్‌పైనే ఫోకస్ చేశాం' అంటూ పోస్ట్ చేసింది. వేసుకునే డ్రెస్సులని బట్టి కల్చర్‌ని జడ్జ్ చేయకూడదని, పండుగల్లో ఎమోషన్సే ముఖ్యమని అంటోంది.

కస్తూర్బా విద్యార్థినులకు డ్రెస్‌ల అందజేత
రక్షాబంధన్ సందర్భంగా నందిపేట్ కస్తూర్బా బాలికల కళాశాలలో శుక్రవారం రాఖీ వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం విద్యార్థినులతో మాట్లాడారు. 314 మంది విద్యార్థినుల సమస్యలు, వసతులపై ఆరా తీసి, 20 మంది విద్యార్థినులకు ఉచితంగా డ్రెస్సులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యతను పరిశీలించారు.
సంకిలిలో రేపు చెరుకు రైతుల సమావేశం
విజయనగరం జిల్లా రేగడి ఆమదాలవలస మండలం సంకిలి గ్రామంలో ఉన్న చక్కెర కర్మగాన్ని ఎల్ నినో ప్రభావం వల్ల నిలిపేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. దీనిపై చెరుకు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సంకిలి గ్రామం హైస్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు.

దుగ్గిరాల మండలంలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెదపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలను కలుపుతూ నిర్మించిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రూ.2.88 కోట్ల నాబార్డ్ నిధులతో 5 కిలోమీటర్లకు పైగా ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుతో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలకు ప్రయాణం సులభం కానుంది. త్వరలో రహదారిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.